క్యూనెట్ పేరుతో కువైట్‌లో ఓ ముఠా ఏర్ప‌డిన‌ది. అక్క‌డి నుంచి ఇండియాకు తిరిగి వ‌చ్చేవారికి వ్యాపారం పేరుతో వ‌ల వేస్తున్న‌ది. వారినుంచి లక్షల రూపాయ‌లు వసూలు చేసి నిండా ముంచుతోంది.  ముఠా చేతిలో మోసపోయిన ఓ యువకుడి  తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.  కడప జిల్లా సంబేపల్లె మండలం శెట్టిపల్లె కస్పాకు చెందిన షేక్‌ హసనుల్లా కొంతకాలం కువైట్ లో  ఉండి సొంతూరికొచ్చాడు. హసనుల్లా దూరపు బంధువు, చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన లియాఖత్‌అలీ, రైల్వేకోడూరుకు చెందిన బొటిక్‌ రాజశేఖర్‌ యాదవ్‌, సురేశ్‌యాదవ్ తో పాటు  మరికొందరు కలసి ‘క్యూనెట్‌’ పేరిట ఓ గ్రూపు ఏర్పాటు చేశారు.

ఇందులో చేరిన వారికి సులభంగా లక్షల రూపాయ‌లు వస్తాయని అమాయకులను నమ్మించేవారు.  సొంత ఊరికి వచ్చిన హసనుల్లాతో లియాఖత్‌ అలీ మాట్లాడి ‘క్యూనెట్‌’లో చేరితే మంచి ఆదాయం వ‌స్తుంద‌ని నమ్మబలికాడు. ‘ఇన్ఫినిటీ’ పేరుతో ఒక  వాట్సాప్‌ గ్రూప్‌ సృష్టించి అందులో హసనుల్లాను చేర్చారు.

క్యూనెట్‌ నిర్వాహకులు తరచూ జూమ్‌ మీటింగ్‌లు ఏర్పాటు చేసి డబ్బు సంపాదించడంపై ఆశ కల్పించేవారు అత‌నికి. తమకు రూ.3.20 లక్షలు ఇస్తే కొన్ని ప్రొడక్ట్‌లు కొంటామని, వాటిపై పెద్దఎత్తున వచ్చే ఆదాయాన్ని ఎప్పటికప్పుడు పంపుతుంటామని వెల్ల‌డించారు. దీంతో హసనుల్లా 2021 మార్చి 25తేదీన‌ రాజశేఖర్‌ యాదవ్‌ ఖాతాలో డబ్బు జమ చేశాడు. ఇన్ని రోజులు అయినా న‌యా పైసా ఆదాయం రాకపోవడంతో అనుమానం వచ్చిన హసనుల్లా తన డబ్బు ఇచ్చేయాలంటా ఆ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు.

 వెంటనే అతడినిఆ గ్రూపులోంచి డెలీట్ చేశారు.  ఫోన్‌ చేస్తే క‌ట్ చేయ‌డం, ఒక వేళ ఫోన్ ఎత్తినా మాట్లాడ‌క‌పోవ‌డం లాంటివి చేసారు. కువైట్ వెళ్లి కష్టపడి సంపాదించిన డబ్బు లాక్కుని తనను రోడ్డున పడేశారని బాధితుడు లబోదిబోమంటూ బోరున విల‌పించాడు. త‌న‌తో పాటు చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన అబ్దుల్‌ వహద్‌, కడపకు చెందిన మస్తాన్‌, రాజంపేటకు చెందిన హబీబ్ లు కూడ ఒక్కొక్కరు రూ.4లక్షల వరకు చెల్లించారని తెలిపారు.  ఆ ముఠాను పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు బాధితుడు. ఇప్ప‌టికే క్యూనెట్‌ ముఠాపై పోలీసులు నిఘా పెట్టారు. అతి త్వ‌ర‌లోనే అదుపులోకి తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: