
ఉద్యోగమో వ్యాపారమో చేసుకుని జీవించడం కంటే.. చోరీలకు పాల్పడి అందిన కాడికి దోచుకుని వచ్చిన దాంతో జల్సాలు చేయాలని కొంతమంది జనాలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాళం వేసి ఉన్న ఇల్లు ఇంటి బయట పార్కు చేసి ఉన్న వాహనాలు ఏం కనిపించినా కూడా వదలడం లేదు. అయితే కేవలం చిన్న చిన్న వాహనాలు మాత్రమే కాదు ఏకంగా పోలీస్ జీప్ లు, ఆర్టీసీ బస్సులు కూడా ఎత్తుకెళ్లిన ఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లడమేంటి గురు.. అని ఈ ఘటనల గురించి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు.
ఇక ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకునే అంతకుమించి అనే రేంజ్ లో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులు లాంటివి ఎత్తుకెళ్లడం మాత్రమే విన్నాం. కానీ ఇక్కడ ఏకంగా యుద్ధ ట్యాంక్ నే ఎత్తుకెళ్లారు దొంగలు. ఇజ్రాయిల్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దుండగులు ఏకంగా యుద్ధ ట్యాంక్ ను ఎత్తుకెళ్లారు. 65 టన్నుల బరువున్న ముర్కవ -2 అనే యుద్ధ ట్యాంక్ సైన్యంలో సేవలందించింది. కొన్నేళ్లుగా సైనిక శిక్షణ అవసరాలకు అధికారులు దానిని వినియోగిస్తున్నారు. అయితే దాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఒక తుక్కు దుకాణంలో ఈ యుద్ధ ట్యాంకు దొరికింది కాక ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.