ఏమిటో ఒక్కోసారి ఎల్లోమీడియా యాజమాన్యం తనంతట తానుగానే అనుకోకుండా చంద్రబాబునాయుడు కుట్రలను బహిర్గతం చేసేస్తుంటుంది.  ప్రతి ఆదివారం వచ్చే కొ(చె)త్తపలుకులో కూడా ఈ ఆదివారం అలాంటి పనే చేసి చంద్రబాబుకు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా తలెత్తిన డిక్లరేషన్ అంశంపై చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు కుట్ర రాజకీయాలను బహిర్గతం చేసింది.  బ్రహ్మోత్సవాల సందర్భంగా జగన్ తిరుమలలోని శ్రీవారి ఆలయానికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. అన్యమతస్తులు తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళినపుడు హిందు మత విశ్వాసాలపై నమ్మకం ఉందని, స్వామివారిపై భక్తి ఉందని డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఎప్పటి నుండో అమల్లో ఉంది.



 

సరే నిబంధన అయితే ఉంది కానీ డిక్లరేషన్ ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు లేనివాళ్ళు లేదు. డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళు తాము ఎందుకు డిక్లరేషన్ ఇచ్చామనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. అలాగే డిక్లరేషన్ ఇవ్వని వాళ్ళు కూడా  ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. కాబట్టి డిక్లరేషన్ విషయం ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు. అయితే  డిక్లరేషన్ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను జగన్ పట్టించుకోకపోవటం అభ్యంతరంగా కనిపిస్తుందని ఎల్లోమీడియా చెప్పింది. ఇదే సమయంలో అసలు జగన్ డిక్లరేషన్ ఇచ్చే విషయం ఇపుడే ఎందుకింత వివాదాస్పదమైంది ? అని కూడా అనుమానాన్ని బయటపెట్టింది. గతంలో ఎన్నడూ జగన్ విషయంలో రాని  డిక్లరేషన్ వివాదం ఇపుడే ఎందుకింతగా రాజుకుంది ? అని కూడా తన చెత్తపలుకులో ఎల్లోమీడియా ప్రశ్నించింది.




దానికి సమాధానం కూడా ఇచ్చింది లేండి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తిరుమల దర్శనానికి వచ్చినపుడు డిక్లరేషన్ ఇవ్వాలని ఏ రాజకీయ పార్టీ కూడా అప్పుడు అడగని విషయాన్ని గుర్తుచేసింది. అలాంటిది ఇపుడు జగన్ విషయంలో మాత్రమే డిక్లరేషన్ వివాదం తెరమీదకు రావటంతో మత రాజకీయాలకు బీజం పడిందని అనుమానం వ్యక్తం చేయటం గమనార్హం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తిరుమల ఆలయంలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటూ పదే పదే డిమాండ్ చేసింది చంద్రబాబునాయుడు, టిడిపి నేతలతో పాటు ఎల్లోమీడియా మాత్రమే. బిజెపి స్ధానిక నేత కూడా ఇదే డిమాండ్ చేసినా ఆయన డిమాండ్ తో తమకు సంబంధం లేదని పార్టీ అప్పుడే ప్రకటించేసింది. దాన్ని ఎల్లోమీడియా జీర్ణించుకోలేకపోతోంది.




మత రాజకీయాలకు భీజం వేయటంలో భాగంగానే జగన్ విషయంలో డిక్లరేషన్ వివాదాన్ని భుజానికి ఎత్తుకున్నది చంద్రబాబే అన్న విషయాన్ని ఎల్లోమీడియా బయటపెట్టింది. ఎందుకంటే జగన్ తిరుమలకు వెళ్ళే నాలుగు రోజుల ముందు నుండి చంద్రబాబు ఇదే విషయాన్ని పదే పదే డిమాండ్ చేశారు. తిరుమలకు చేరుకునే రోజు కూడా చిత్తూరు జిల్లా నేతలతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ డిక్లరేషన్ విషయంలో జగన్ను ఒత్తిడి చేయాలంటూ బాగా రెచ్చగొట్టారు. అయితే చంద్రబాబు మాటలను తమ్ముళ్ళెవరు పట్టించుకోలేదులేండి అది వేరే సంగతి. కొద్ది రోజులుగా ఎన్నిలేని విధంగా చంద్రబాబు హిందుత్వం గురించి, హిందుమతం గురించి పదే పదే మాట్లాడుతున్నారు.




మొన్నటి ఎన్నికల్లో తనను ఘోరంగా దెబ్బతీసిన జగన్ను మళ్ళీ దెబ్బకొట్టాలంటే తాను ఏదో విధంగా జనాలను ఆకర్షించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఏదారి కనబడలేదు కాబట్టే చివరకు మత రాజకీయాలను భుజానేసుకున్నట్లు అనుమానంగా ఉంది. దీన్ని ఎల్లోమీడియా ధృవీకరించటం గమనార్హం.  కాబట్టి మత రాజకీయాల విషయంలో బిజెపినే కాదు చంద్రబాబు కూడా పెద్ద వ్యూహంతోనే ఉన్నట్లు అందరికీ అర్ధమైపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: