ఏపీ సీఎం జగన్‌కూ..  తెలుగు దేశం అనుకూల మీడియాకూ ఉన్న వైరం ఇప్పటిది కాదు.. ఇది ఓ నిరంతర ప్రక్రియ.. ప్రధానంగా ఆ రెండు పత్రికలు అంటూ ఆనాడు వైఎస్‌ నుంచి ఈ వైరం సాగుతూనే ఉంది. ఇప్పటికీ అది కొనసాగుతోంది. గతంలో ఆ రెండు పత్రికలు అనేవారు.. ఇప్పుడు అది మరో నాలుగైదు మీడియా చానళ్లుగా విస్తరించింది. అయితే.. ఈ టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు జగన్‌ ను దెబ్బ తీసేందుకు ఓ సరికొత్త వ్యూహం అనుసరిస్తోంది.


అదేంటంటే.. జగన్‌ను దెబ్బ తీయాలంటే.. ఆయనకు అత్యంత సన్నిహితులుగా పేరున్న ఆ నలుగురిని టార్గెట్ చేయాలి.. జగన్ ఏ కీలక నిర్ణయం తీసుకున్నా.. దాన్ని కార్యరూపంలోకి తెచ్చే బాధ్యతను తీసుకునే వ్యక్తులు నలుగురు ఉన్నారు. వారు జగన్‌కు అత్యంత సన్నిహితులుగా పేరుబడ్డారు. ఆ నలుగురు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వీరిలో పెద్దిరెడ్డి మంత్రికాగా.. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌.. ఇక విజయసాయిరెడ్డి ఎంపీ అయితే.. సజ్జల ప్రభుత్వ సలహాదారు.


ఇప్పుడు టీడీపీ మీడియా ఓ పథకం ప్రకారం ఈ నలుగురిని టార్గెట్ చేస్తోంది. వీరుపై క్రమం తప్పకుండా వ్యతిరేక కథనాలు ఇస్తూ విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. వీరిని దెబ్బ తీయడం ద్వారా జగన్‌ను దెబ్బ తీయాలన్నది టీడీపీ అనుకూల మీడియా వ్యూహంగా ఉంది. కొద్దిరోజులుగా ఏపీలో ఉద్యోగు అంశం ఓ సీరియస్ ఇష్యూగా మారింది. దీన్ని పరిష్కరించే ప్రక్రియలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు. మొత్తానికి సమస్య ఓ కొలిక్కి వచ్చినట్టే అనిపించినా.. ఆ తర్వాత రివర్స్ అయ్యింది.


ఉద్యోగ సంఘాలను ఒప్పించడంలో సజ్జల పాక్షికంగానే విజయం సాధించారు. ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో తెలియదు కానీ.. ముందుగా ప్రభుత్వ నిర్ణయానికి ఓకే చెప్పిన ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ససేమిరా అంటూ ఏకంగా సమ్మెకు రెడీ అవుతున్నాయి. ఈ పరిణామాల్లో సజ్జలే మెయిన్ విలన్ అన్నట్టుగా టీడీపీ మీడియా ఫోకస్ చేస్తోంది. మరి ఈ చతుర్ముఖ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: