2019 ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ హత్య జరిగినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉంది.. ఆయన హత్య కేసు విచారణ కోసం సిట్ వేయించారు. ఆ తర్వాత ఎన్నికల్లో జగన్ గెలిచారు.. తర్వాత సిట్ విచారణ నత్త నడకన సాగింది. దీంతో తన తండ్రి హత్య కేసులో దోషులకు శిక్షలు పడాల్సిందేనని భావించిన ఆయన కుమార్తె సునీత.. దర్యాప్తు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక లాభం లేదనుకుని.. కేసు విచారణ కోసం సీబీఐని ఆశ్రయించారు.


ఆ తర్వాత సీబీఐ రంగంలోకి దిగింది. అప్పటికీ కేసు విచారణలో జోరు పెరగలేదు.. ఆ తరవాత సునీత కేసు విచారణ వేగవంతం చేయాలని డిల్లీ వెళ్లి మరీ సీబీఐ అధికారులను కలిశారు. ఈ కేసు విషయంలో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన తండ్రి సీఎం వైఎస్‌ జగన్‌కు సొంత బాబాయి. సొంత బాబాయి హంతకులను కూడా సీఎం జగన్ ఇంకా శిక్షించలేదన్న ఆవేదన, ఆక్రోశం సునీతలో కనిపిస్తున్నాయి.  అయితే.. ఈ కేసులో సీబీఐ విచారణను బట్టి చూస్తే.. హత్య కేసు వెనుక.. కీలక హస్తం అవినాష్‌ రెడ్డిదేనని తేలుతున్నట్టు సునీత భావిస్తున్నారు.


ఇప్పటి వరకూ వెలుగు చూసిన సీబీఐ వాంగ్మూలను బట్టి చూస్తే వైఎస్ అవినాష్ రెడ్డి ఈ హ్య వెనుక ఉన్నారని దస్తగిరి వంటి నిందితులు తమ వాంగ్మూలాల్లో తెలిపారు. అందుకే ఇప్పుడు అవినాష్ రెడ్డిపై చర్యల కోసం పోరాటం చేస్తున్నారు. తాజాగా ఆమె ఈ విషయంలో రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌, పీఎంవోకు కూడా లేఖలు రాశారు. తన తండ్రి హత్య వెనుక కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి హస్తం ఉందని.. ఆయన్ను విచారించాలని ఆమె తన లేఖల్లో పేర్కొన్నారు.


వైఎస్‌ అవినాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని.. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న కుట్ర దారుల్ని బయటపెట్టాలని కోరుతూ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, ప్రధాన మంత్రి కార్యాలయం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖలకు ఉత్తరాలు రాశారు. వివేకా హత్య ఘటనలో అవినాష్‌ ప్రమేయం గురించిన వివరాలు ఆమె లేఖల్లో పొందుపరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: