పార్టీని నమ్ముకున్నవారికి, పార్టీకోసం త్యాగాలు చేసినవారికి నామినేటెడ్ పదవులిస్తూ ఊరడిస్తుంటారు అధినేతలు. అయితే చంద్రబాబు ఈ విషయంలో పార్టీ నాయకులకు సరైన న్యాయం చేయలేకపోయారనే అపవాదు ఉంది. గత ప్రభుత్వంలో కూడా నామినేటెడ్ పదవుల పంపకాన్ని చివరి ఏడాది మొదలు పెట్టారు చంద్రబాబు. కనీసం అలా పదవులు పొందినవారికి కూడా ఆ సంతోషం మిగలకుండా చేశారు. వెంటనే ఎన్నికలొచ్చాయి, పార్టీ అధికారం కోల్పోయింది, పదవి ఉన్నా నేతలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. కానీ జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచీ నామినేటెడ్ పోస్ట్ ల వ్యవహారంలో ఉదారంగా ఉన్నారు. మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న రోజాను ఏపీఐఐసీ చైర్మన్ ని చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవడంతో.. పార్టీకోసం పోటీనుంచి తప్పుకున్నవారికి మరోసారి న్యాయం చేయబోతున్నారు.