రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కుల‌కు వ్యూహాలు ఉండాలి. వ్యాపారాల్లో ఉన్న ఉద్ధండుల‌కు లౌక్యాలు ఉండాలి. నాయ‌కుల‌కు వ్యూహాలు లేక పోయినా.. వ్యాపార వ‌ర్గాల‌కు లౌక్యం లేక‌పోయినా.. క‌ష్ట‌మే. రాష్ట్రంలో అటు రాజ‌కీయాల‌ను శాసిస్తూనే.. ఇటు వ్యాపారంలోనూ దూకుడు ప్ర‌ద‌ర్శించే మీడియా అధిప‌తిగా రామోజీరావు  పేరు తెచ్చుకున్నారు. మీడియా డాన్‌గా ఆయ‌న ప్ర‌సిద్ధి చెందారు. కాలానుగుణంగా మార్పులు సంత‌రించు కుంటూ.. త‌న వ్యాపారాన్ని నిత్య నూత‌నం చేసుకుని ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యారు. అవుతున్నారు. దాదాపు 40 ఏళ్లుగా మీడియాలో ఉంటూ.. ఆయ‌న సాధించ‌ని విజ‌యం అంటూ ఏమీలేదు.

 

అయితే, వ్యాపారాల్లోనూ ఒక్కొక్క‌సారి ఎగుడు దిగుడులు త‌ప్ప‌వు. ఎదురీత‌లు కూడా త‌ప్పవు. ఇలాంటి స‌మ‌యాల్లోనే స‌ద‌రు వ్యాపార దిగ్గ‌జాల లౌక్యం బ‌య‌ట ప‌డుతుంది. తాము ఎలా ముంద‌డుగు వేయాల‌నే వ్యూహం వారి నుంచి తెలుస్తుంది. ఈ విష‌యం ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారి దాదాపు ప‌ది మాసాలైంది. గ‌తంలో రామోజీకి, ఈనాడుకు అనుకూల‌మైన ప్ర‌భుత్వం ఏపీలో ఉండే దికానీ, గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికారంలోకి వైసీపీ వ‌చ్చింది. నిజానికి వైసీపీ అధికారంలోకి రావ‌డం కొన్ని మీడియా సంస్థ‌ల‌కు ఇష్టంలేద‌నే విష‌యం తెలిసిందే.

 

మీడియా వ‌ర్గాల్లో ఈనాడు కూడా ఉంద‌నేది తెలిసిందే. అందుకే.. రాజ‌ధాని అమ‌రావ‌తిని మూడుగా వికేంద్రీక‌ర‌ణ చేస్తామ‌ని జ‌గ‌న్ చెప్పినప్పుడు భారీ ఎత్తున వ్య‌తిరేక క‌థ‌నాల‌ను వండి వార్చింది ఈనాడు. జ‌‌గ‌న్ వ్యూహ‌మే త‌ప్ప‌ని అంటూ.. కొంద‌రితో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు చేయించి మ‌రీ ప్ర‌చురించింది. ఇలా ప్ర‌త్యేక పేజీలు కూడా నిర్వ‌హించింది. కొన్ని సంద‌ర్భాల్లో హైకోర్టు సైతం ఈనాడు క‌థ‌నాలు, ఫొటోల‌ను కూడా త‌న విచార‌ణ‌లో భాగం చేయ‌డం ప్ర‌స్తావ‌నార్హం. 

 

అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో తెలుగు  మీడియం ర‌ద్దు చేయాల‌న్న జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని కూడా ఈనాడు తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకించింది. ఇలా ఈ రెండే కాకుండా అనేక విష‌యాల్లో జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగానే వార్త‌లు, క‌థ‌నాలు ఇచ్చారు. ఫ‌లితంగా ప్ర‌భుత్వం నుంచి ప్ర‌క‌ట‌న‌లు త‌గ్గిపోయాయి. దీంతో ఆర్ధిక ప‌రిస్థితి కుంటు ప‌డింది. మ‌రోప‌క్క‌, కీల‌క అం శాల విష‌యంలోనూ ఈనాడును ప్ర‌భుత్వం లెక్క‌చేయ‌లేదు. దీంతో ఈనాడు అధిప‌తి రామోజీరావు.. ఖం గుతిన్నారు. త‌న వ్యాపారం దెబ్బ‌తినే ప‌రిస్థితి వ‌చ్చే స‌రికి.. లౌక్యంగా ఆయ‌న జ‌గ‌న్‌కు స‌రెండ‌ర్ అయ్యారు. 

 

గ‌డిచిన పక్షం రోజులుగా ప్ర‌భుత్వానికి అనుకూలంగా క‌థ‌నాలు రాయ‌డం, వ్య‌తిరేక వార్త‌ల‌ను చిన్నవిగా చూప‌డం వంటివి ఈనాడులో క‌నిపిస్తుండ‌డాన్ని బ‌ట్టి.. విశ్లేష‌కులు ఇదే భావ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఏదేమైనా.. వ్యాపారంలో ఉన్న‌వారు ఏ ఎండ‌కు ఆగొడుగు ప‌ట్టాల్సిందే! అనే సామెత‌ను రామోజీ నిజం చేస్తున్నార‌ని అంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: