కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణలో ఎక్కడికక్కడ జిల్లాల యంత్రాంగం నానా అవస్తలు పడుతోంది. అయితే జిల్లాల్లోని కార్యక్రమాలను ముందుండి నడింపించాల్సిన ఇన్చార్జీ మంత్రులు మాత్రం ఎక్కడా అడ్రస్ కనబడటం లేదు. ఒక్కో జిల్లాలకు ఒక్కో మంత్రిని ఇన్చార్జిగా జగన్మోహన్ రెడ్డి నియమించాడు.  ఆయా జిల్లాలకు సంబంధించిన సమస్త నిర్ణయాలను తీసుకునే సర్వాధికారాలను సిఎం ఇన్చార్జి మంత్రులకు అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. అయినా కానీ కరోనా వైరస్ లాంటి సంక్షోభ సమయంలో  తాము ఇన్చార్జిలుగా ఉన్న జిల్లాల్లో ఎంతమంది మంత్రులు పర్యటిస్తున్నారు ? ఎంతమంది శ్రద్ధ తీసుకుంటున్నారు ? అన్నదే ఇపుడు ప్రశ్నార్ధకమైంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేంద్రం లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను  మినహాయిస్తే మిగిలిన  11 జిల్లాలు రెడ్ జోన్ లో ఉంది. సరే కేంద్రం లెక్కల్లో తప్పులున్నాయని రాష్ట్రప్రభుత్వం వాదిస్తోంది. జిల్లాలను యూనిట్ గా కాకుండా మండలాలను యూనిట్లుగా తీసుకోవాలని వాదిస్తోంది. ఎవరెంత వాదించిన అంతిమంగా కేంద్రం చెప్పిందే జరుగుతుంది. అయితే జిల్లాలు యూనిట్ అయినా మండలాలు యూనిట్ అయినా తాము ఇన్చార్జిగా ఉన్న జిల్లాల్లో తిరగాల్సింది, పనులు చేయించాల్సింది మాత్రం ఇన్చార్జి మంత్రులే.

 

ఇప్పుడు ఇన్చార్జి మంత్రుల ప్రస్తావన ఎందుకొచ్చిందంటే 11 జిల్లాల్లో కూడా కర్నూలు, గుంటూరు జిల్లాలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. రాష్ట్రంలో సుమారు వెయ్యి కేసులు రిజస్టరైతే పై రెండు జిల్లాల్లోనే 400కు పైగా కేసులు నమోదయ్యాయి.  కర్నూలు జిల్లాకు అనీల్ కుమార్ యాదవ్, గుంటూరుకు చెఱుకువాడ శ్రీరంగనాధరాజు లు ఇన్చార్జిలు.  అలాగే చిత్తూరు జిల్లాలకు మేకపాటి గౌతమ్ రెడ్డి ఇన్చార్జి. ఈ జిల్లాలో నమోదైన 75 కేసుల్లో ఒక్క శ్రీకాళహస్తిలోనే 50 కేసులు బయటపడ్డాయి.  కర్నూలు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని అధికారపార్టీ ప్రజాప్రతినిధుల వల్లే కేసులు పెరిగిపోయాయనే ఆరోపణలున్నా మంత్రులు, ఇన్చార్జిమంత్రులు మాత్రం ఏమి పట్టనట్లే ఉన్నారు.

 

కేసుల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న కారణంగా మంత్రులతో పాటు ఇన్చార్జిలు కూడా రెగ్యులర్ గా పర్యటించాలి. లాక్ డౌన్ తో పాటు క్వారంటైన్, ఐసొలేషన్ కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయో చూడాలి. కరోనా వారియర్స్ కు అవసరమైన మెడికల్ ఎక్విప్మెంట్ ఉందో లేదో చెక్ చేయాల్సిన బాధ్యత కూడా వీళ్ళదే. అసలు ఈ జిల్లాల్లో కేసుల సంఖ్య ఎందుకు పెరిగిపోతోందో చూడాల్సిన బాధ్యత కూడా వీళ్ళదే. జిల్లా యంత్రంగంతో మీటింగులు పెట్టటం, జనాల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవటం,  అర్హులైన పేదలందరికీ నిత్యావసరాలు అందుతున్నాయో లేదో చూసుకుంటేనే ఇన్చార్జి మంత్రుల వల్ల ఆయా జిల్లాలకు ఉపయోగం ఉంటుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: