ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఆరేళ్ళల్లో నరేంద్రమోడికి ఇంతగా హీటెక్కించేసిన ఘటన ఇంత వరకు ఎదురుకాలేదు. అలాంటిది తాజాగా పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పాసై చట్టంగా మారిన నూతన వ్యవసాయ సంస్కరణల చట్టంపై యావత్ దేశం అట్టుడికి పోతోంది. సుమారు ఆరు రాష్ట్రాల్లో రైతులు సంఘటితమై కేంద్రప్రభుత్వంపై తిరుగుబాటు లేవదీశాయి. దాంతో ఢిల్లీ సరిహద్దుల్లో గడచిన నాలుగు రోజులుగా తీవ్రస్ధాయిలో ఉద్రిక్తతలు కంటిన్యు అవుతున్నది. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసమని  కేంద్రం తెచ్చిన నూతన చట్టం వల్ల దేశంలోని రైతాంగానికి తీరని నష్టం ఖాయమంటు వివిధ రాష్ట్రాల్లోని రైతులు, రైతు సంఘాలు ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టటమే ఆశ్చర్యంగా ఉంది. రైతులు ఎంతగా ఆందోళనలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవటంతో రైతు సంఘాలు మరింతగా రెచ్చిపోతున్నాయి. మొదటగా ఆందోళనలు పంజాబులో ప్రారంభమై చివరకు తమిళనాడు, కర్నాటక, హర్యన, మహరాష్ట్ర, కేరళకు పాకాయి.




మొదటి నుండి కూడా ఉద్యమం పంజాబులో చాలా ఉధృతంగా జరుగుతోంది. రైతాంగానికి మద్దతుగానే కేంద్రప్రభుత్వంలో భాగస్వామైన శిరోమణి అకాలీదళ్ మంత్రివర్గంలో నుండి బయటకు కూడా వచ్చేసింది. తాజగా ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో జరిగిన రైతుల ఆందోళన, పోలీసుల ఎదురుదాడి తదితరాలతో ఉద్యయం యావత్ దేశాన్ని ఆకర్షించింది. వివిధ రాష్ట్రాల నుండి కాలినడకన ఢిల్లీకి బయలుదేరిన రైతులు పెద్ద ఎత్తున హర్యానాలో ఏకమయ్యారు. దాంతో వాళ్ళని సరిహద్దులు దాటి ఢిల్లీలోకి అడుగు పెట్టనీయకుండా హర్యానా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫెయిలయ్యాయి. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారేకేడ్లను దాటుకుని రైతులు సరిహద్దుల వైపు దూసుకువెళ్ళారు. దాంతో వాళ్ళని ఆపేందుకు పోలీసులు పెద్ద ఎత్తున లాఠీచార్జి చేయటం, టియర్ గ్యాస్ వదలటం, వాటర్ కానన్స్ ను ప్రయోగించిన ఘటనలతో రైతాంగం ఆందోళనలపై యావత్ దేశం దృష్టి సారించింది.




ఇన్ని సంవత్సరాల్లో ఏ అంశంపైన కూడా మోడికి ఇంతటి ప్రతిఘటన ఎదురుకాలేదనే చెప్పాలి. ప్రస్తుత రైతాంగం ఆందోళనలను ఎలా ఆపుచేయాలో అర్ధంకాక మోడి సర్కార్  నానా అవస్తలు పడుతోంది. మొదట్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ తో సమావేశం ఉంటుందని చర్చలు జరపవచ్చని ఢిల్లీకి ఆహ్వానించింది. రైతుసంఘాలు సమావేశానికి వచ్చినపుడు కేంద్రమంత్రి కాకుండా ఆయన కార్యదర్శి వచ్చి రైతులతో చర్చలు జరుపుతానని చెప్పారు. దాన్ని అవమానంగా భావించిన రైతుసంఘాలు సమావేశన్ని బాయ్ కాట్ చేశాయి. తర్వాత నుండి కేంద్రం ఎన్నిసార్లు చర్చలకు ఆహ్వానించినా రైతు సంఘాలు స్పందించటం లేదు. తాము మరోసారి అవమానానికి గురవ్వటానికి సిద్ధంగా లేమంటూ తెగేసి చెప్పాయి. దాంతో రెండు వైపుల చర్చల్లో ప్రతిష్టంభన ఉండిపోయింది. సమస్యే రోజు రోజుకు పెరిగిపోతోంది. కేంద్రమేమో చట్టాన్ని మార్చేది లేదంటోంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు ? ఎలా దొరుకుతుందో ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి: