సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయడం ఒక ఎత్తు అయితే, వాటిని సమీక్షించుకోవడం మరో ఎత్తు. సమీక్షల విషయంలోనే చాలామంది తప్పులు చేస్తూ ఇబ్బంది పడుతుంటారు. గతంలో చంద్రబాబు కూడా అమరావతి అభివృద్ధి అంటూ అదే ఆలోచనలో ఉండిపోయారు. మిగతా రాష్ట్రం ఏం కోరుకుంటోంది, ప్రభుత్వ పనితీరు ఏంటి అనేది బేరీజు వేసుకోలేకపోయారు. ఫలితం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వైసీపీ కూడా అదే తప్పు చేస్తుందా లేదా అనేది సందేహం.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది. ఎన్నికలకింకా దాదాపు మూడేళ్ల సమయం ఉంది. అయితే అక్కడ ప్రతిపక్షాలు ఊరుకునేలా లేవు, టీడీపీ అధికారం కోసం ఎదురు చూస్తోంది. ఏపీలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ఆలోచిస్తోంది. జనసేన కూడా తన ఉనికి చాటుకోడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ దశలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా ప్రతిపక్షాలకు ఇవ్వకూడదంటే ఇప్పటినుంచే జగన్ జాగ్రత్త పడితే మేలు.
రచ్చబండ అయినా, మరో కార్యక్రమం అయినా జనాల్లోకి వెళ్లడానికి జగన్ ప్రయత్నం చేయాలి. అయితే రచ్చబండ కార్యక్రమం మాత్రం పలుమార్లు వాయిదా పడింది. కరోనా కారణంగా ఎప్పటికప్పుడు జగన్ ఆగిపోతున్నారు. ఆగస్ట్ 16న స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రజలకు అంకితం చేసిన తర్వాత మరోసారి జనాల్లోకి వెళ్లేందుకు జగన్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పనితీరు తెలుసుకోడానికి, తప్పులు దొర్లితే సరిదిద్దుకోడానికి ఇదో మంచి అవకాశం. మరి ఈసారయినా జగన్ కల నెరవేరుతుందేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి