పాన్ ఇండియా హీరో ప్రభాస్‌ను ఏపీ సీఎం జగన్ ఖుషీ చేశారు.. రాధేశ్యామ్ సినిమా ఈనెల 11న విడుదల కాబోతోంది. ఏపీ థియేటర్లలో సినిమా టికెట్ల రేట్లు పెంచాలని పరిశ్రమ పెద్దలంతా కలిసిన ఇటీవల సీఎం జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఇలా కలిసిన వారిలో రాజమౌళి, ప్రభాస్, మహేశ్ బాబు, చిరంజీవి వంటి వారు కూడా ఉన్నారు. అందులోనూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు వంటి వారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన సీఎంను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు.


ప్రభాస్, రాజమౌళి వంటి వారు తమ రాబోయే సినిమాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ విడుదల నేపథ్యంలోనే సీఎం జగన్‌ను కలిశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాని ఫలితం కనిపిస్తోంది. సీఎం సానుకూలంగా స్పందించారని.. నెలాఖరుకల్లా కొత్త జీవో వస్తుందని గత నెలలోనే స్టార్లు ప్రకటించారు. కానీ.. అది ఆచరణలోకి రాలేదు. జగన్‌కు గిట్టని పవన్‌ సినిమా భీమ్లా నాయక్ విడుదల ఉందని.. దాని తర్వాతే జీవో వస్తుందని భావించారు. అలాగే జరిగింది. భీమ్లా నాయక్‌ పాత టికెట్లతోనే ఆడించుకోవాల్సి వచ్చింది.


ఇక ఇప్పటికే రాధేశ్యామ్ ప్రమోషన్లలో ఉన్న ప్రభాస్.. నిన్న మీడియాతో మాట్లాడితే రాధేశ్యామ్ విడుదలలోపు కొత్త జీవో వస్తే తాను సంతోషిస్తానని అన్నారు. మరి ఆయన్ను సంతోష పరచడానికా అన్నట్టు రాధేశ్యామ్ సినిమా విడుదలకు సరిగ్గా నాలుగు రోజుల ముందు ఈ కొత్త జీవో విడుదలైంది. ఈ జీవో ద్వారా కనిష్టంగా సినిమా టికెట్‌ రూ.20 ఉంటుంది. గరిష్టంగా 250 ఉంటోంది. గతంలో ఈ రేట్లు కనిష్టంగా రూ.5 ఉండేది.. గరిష్టం 150 వరకూ ఉండేది.


ఇక ఇప్పుడు వరుసగా కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆర్.ఆర్.ఆర్, సర్కారువారి పాట, ఆచార్య వంటి సినిమాలు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ టికెట్ల పెంపు సినీ పరిశ్రమకు ఊరట కలిగిస్తుంది. మొత్తానికి జగన్ ముందు సినిమా టికెట్ల రేట్లు తగ్గించి.. ఆ తర్వాత సినీ పెద్దలను తన వద్దకు రప్పించుకుని.. బతిమాలించుకుని.. ఆ తర్వాత రేట్లు పెంచి.. ఖుషీ చేశారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: