ఏపీకి చాలా ముఖ్యమైన ప్రాజెక్టుగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు.. 2018లోనే పోలవరం పూర్తి చేస్తామన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించినట్టు అనుకూల మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. పూర్తి కాబోతున్న పోలవరం ప్రచారం కోసం ప్రజలను ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లి మరీ ఉచితంగా చూపించారు. కానీ.. అసలు కీలకమైన నిర్మాణాలు ఇంకా పూర్తి కానే లేదు. కానీ అప్పటికే రెండు, మూడు సార్లు చంద్రబాబు ప్రారంభోత్సవం అంటూ హడావిడి చేశారు.


ఇక ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక.. పోలవరం టెండర్లలో అవకతవకలు జరిగాయని కాంట్రాక్టర్‌ను మార్చారు.. ఈ ప్రహసనం కోసం చాలా సమయం పట్టింది. ఆ తర్వాత వరదల కారణంగా పనులు ఆగాయి. ఇప్పుడు పనులు జరుగుతున్నా.. అంత వేగం కనిపించడం లేదు. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే.. ఇప్పుడు కొత్తగా పోలవరంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బ తిన్నదన్న వాదన వెలుగులోకి వస్తోంది.


అయితే.. ఈ డయాఫ్రమ్ వాల్ చంద్రబాబు హయాంలో చేసిన తప్పుల వల్లే వచ్చిందని కొత్తగా మంత్రి పదవి చేపట్టిన అంబటి రాంబాబు అంటున్నారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయం.. ప్రణాళిక లోపం వ‌ల్లే పోల‌వ‌రం డ‌యాఫ్రమ్ వాల్ దెబ్బతింద‌ని అంబటి అంటున్నారు.  కాఫ‌ర్ డ్యామ్ పూర్తికాకుండా డ‌యాఫ్రమ్ వాల్ క‌ట్టడం టీడీపీ చేసిన చారిత్రక త‌ప్పిదం కాదా..? అని అంబ‌టి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు అనుభ‌వం ఉంద‌ని, 2018లోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పిన టీడీపీ నేత‌లు ఎందుకు పూర్తి చేయ‌లేక‌పోయార‌ని అంబటి ఇప్పుడు  ప్రశ్నించారు.


కాఫ‌ర్‌ డ్యామ్‌ సగంలో ఉండగానే డయాఫ్రమ్‌ వాల్‌ కట్టారన్న అంబటి.. టీడీపీ చేసిన చారిత్రక తప్పిదం పోల‌వ‌రం ప్రాజెక్టుకు శాపంగా మారింద‌ని విమర్శించారు. ఆర్‌అండ్‌ఆర్‌ పూర్తి కాకపోవడంతో 56 గ్రామాలు మునిగిపోతాయని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. వరదలకు ముందే కాఫర్ డ్యామ్ క్లోజ్ చేస్తే గ్రామాలకు ముంపు వస్తుందన్న అంబటి.. తాము ఆర్అండ్ఆర్ పూర్తి చేసి క్లోజ్ చేశామని చెప్పారు. మరి చంద్రబాబు కారణంగానే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే.. ఇన్నాళ్లూ వైసీపీ సర్కారు ఎందుకు ఆ విషయం బయటపెట్టలేదన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: