వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీకి ఓటేస్తే ఏపీ అంధకారంలో చిక్కుకుంటుందని పవన్ కల్యాణ్ హెచ్చరిస్తున్నారు. నిన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్‌.. అధికార వైసీపీ తీరును ఎండగట్టారు. రాజకీయాల్లో పౌరుషాలు ఉండవని.. కేవలం వ్యూహాలే ఉంటాయని పవన్‌ కల్యాణ్ చురకలు వేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉంటామని పవన్ కల్యాణ్‌ చెప్పారు.


తాను ఎప్పుడూ రాష్ట్ర ప్రజల క్షేమం కోసమే తాను ఆలోచిస్తున్నానని.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని పవన్ కల్యాణ్‌ అన్నారు. వైసీపీకి మళ్లీ ఓటేస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని పవన్ కల్యాణ్‌ హెచ్చరించారు. ప్రజల గుండెల్లో ఉన్న పదవి కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని పవన్ కల్యాణ్‌ చెప్పారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా? వద్దా? అనేది తాము నిర్ణయించుకుంటామన్న పవన్ కల్యాణ్‌.. సింగిల్‌గా రావాలని అడిగేందుకు మీరెవరని జగన్ ను ప్రశ్నించారు.


పొత్తులపై తానేమీ దొంగచాటుగా చేయనంటున్న పవన్ కల్యాణ్‌.. అలా ఏమైనా చేస్తే చెప్పే చేస్తానని.. తనకు ఎలాంటి భయాలు లేవన్నారు. సింగిల్‌గా వచ్చి ప్రజల్ని చీల్చి చెండాడుతున్నారంటూ వైసీపీ నేతలపై పవన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధమేనంటున్న పవన్ కల్యాణ్.. తనకు పదవులు,  డబ్బుపై వ్యామోహం లేదన్నారు. ప్రజలు రేపు అధికారం ఇచ్చినా బాధ్యతగా స్వీకరిస్తానని చెప్పుకొచ్చారు.


రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ ఏపీకి దెబ్బలు తగులుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసిన పవన్‌ కల్యాణ్.. తనపై కేసులు లేనందునే దిల్లీలో భాజపా నేతలు వద్ద ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానన్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయని విర్రవీగుతున్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 15 సీట్లు కూడా రావని పవన్ కల్యాణ్‌ కామెంట్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలన్నీ కలిసి రావాలంటున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. తనకు ఏ పార్టీ పైనా వ్యక్తిగత ఆపేక్ష లేదని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: