ఏపీ రాజకీయాలు ఎవరికీ అంతు పట్టడం లేదు. అధికార పక్షంగా వైసీపీ ఉంది. విపక్ష పార్టీలుగా టీడీపీ, జనసేన ఉన్నాయి. జాతీయ పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలతో పోల్చుకుంటే జాతీయ పార్టీల ఉనికి అంతంత మాత్రమే. కానీ రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ పార్టీలు బీజేపీతో స్నేహం కోసం ప్రయత్నిస్తుండటం విశేషం.


ఇందులో వైసీపీ బీజేపీతో నేరుగా పొత్తుకు సిద్ధంగా లేదు కానీ రాజకీయ ప్రయోజనాల  విషయంలో ఆ రెండు పార్టీలకు పరస్పరం ఓ అవగాహన ఉంది. మరోవైపు టీడీపీ, జనసేనలు తమతో కలిసి బీజేపీ వస్తోందనే నమ్మకంతో ఉన్నారు. కానీ బీజేపీ నుంచి ఎటువంటి సిగ్నళ్లు రావడం లేదు. ఇలాంటి తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకి దిల్లీ నుంచి పిలుపొచ్చింది. ఆయన దిల్లీ వెళ్లి బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా తో పాటు జేపీ నడ్డాను కలిశారు. కానీ ఇంకా క్లారిటీ రాలేదు. మరో వారంలో పొత్తులు, సీట్లపై ఓ స్పష్టత రానుంది.


అయితే జగన్ మాత్రం టీడీపీ, జనసేన తో పాటు బీజేపీ పొత్తులో ఉండాలని కోరుకుంటున్నారు.  అలా అయితే సానుభూతితో పాటు ఏకపక్ష విజయం తన సొంతం అవుతుందని ఆయన భావిస్తున్నారు. దీనికి ఆయన తెలంగాణ ఎన్నికల లెక్కలు వేసుకుంటున్నారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలతో పాటు తెజసలు మహా కూటమిగా ఏర్పడి ప్రస్తుత బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ ను ఎదుర్కొన్నారు. అందులో ఆ కూటమికి 21 సీట్లే వచ్చాయి.


ఈ సారి ఎవరికి వారు విడివిడిగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ కు లబ్ధి చేకూరింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీ బాగానే చీల్చగలిగింది. దీంతో బీఆర్ఎస్ కు అంతిమంగా నష్టం చేకూరింది. ఇదే ఫార్ములా తనకు వర్కౌట్ అవుతుందని జగన్ భావిస్తున్నారు. కలసి వస్తే ఇరు పార్టీల మధ్య సీట్ల విషయంలో అలకలు, ఒకరికి ఒకరు సహకరించకపోవడంతో పాటు తటస్థ ఓటర్లు తన వైపే ఉంటారని జగన్ భావిస్తున్నారు. మరో వైపు తృతీయ ప్రత్యామ్నాయం లేకపోవడం కూడా తనకే కలసి వస్తుందనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: