గత ఎన్నికల ప్రచారంలో ఏపీలో అప్పుల గురించి వచ్చిన ప్రస్తావనే ఎక్కువ. జగన్ సర్కార్ హయాంలో అప్పులు విపరీతంగా చేశారని.. ఫలితంగా రాష్ట్రాన్ని శ్రీలంక చేయబోతున్నారని.. అపులు చేసి పప్పు బెల్లాల్ల పంపిపెట్టారని కూటమి పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారని చంద్రబాబు, పవన్ లు పదే పదే ఆరోపించారు. వీరితో పాటు కూటమి నేతలు ఈ విషయాన్ని జనంలోకి బాగా తీసుకెళ్లారు. ఎన్నికల ప్రచారంలోనూ ఈ విమర్శలు కీలక భూమిక పోషించాయని అంటారు.
అయితే... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అందించిన సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తూనే, కొత్త పథకాలు అందిస్తామని, అందుకోసం అవసరమైన సంపదను సృష్టిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ సమయంలో వైసీపీ పాలన వల్ల రాష్ట్రంలో అప్ప్పు రూ.14 లక్షలకోట్లు అనే ప్రచారం బలంగా జరిగిందని చెబుతారు!
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులపై వైసీపీ సభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, విశ్వేష్వర రాజు రాష్ట్ర అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లిఖితపూర్వకంగా క్లారిటీ ఇచ్చారు! జగన్ హయాంలో పబ్లిక్ అప్పులు రూ.2,34,225 కోట్లని తెలిపారు.
ఇదే సమయంలో.. కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పులు రూ.1,05,355 కోట్లని ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. అంటే... జగన్ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లని.. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.5,19,192 కోట్లని తాజాగా ఏపీ ఆర్థిక శాఖ స్పష్టం చేసింది!
వైసీపీ ఎక్స్ వేదికగా మండి పడింది. ఏపీ అప్పు రూ.10 లక్షల కోట్లు దాటిందని తప్పుడు ప్రచారం చేసి.. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని తెలిపింది. జగన్ హయాంలో 2019-2024 మధ్య అప్పు 2.57 లక్షల కోట్ల నుంచి 4.91 లక్షల కోట్లకి పెరిగినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారని వెల్లడించింది. "మరి ఆంధ్రప్రదేశ్ లో అప్పు రూ.10 లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రచారం చేశావ్ కదా చంద్రబాబు.. ఇప్పుడు ప్రజలకి బహిరంగ క్షమాపణలు చెబుతారా?" అని వైసీపీ ప్రశ్నించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి