
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రధాన ఆర్థికవేత్త మార్క్ జాండీ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. అమెరికా జీడీపీలో దాదాపు మూడో వంతు ఇప్పటికే మాంద్య స్థితిలోకి జారుకుందని ఆయన హెచ్చరించారు. అమెరికాను మూడు ముక్కలుగా విభజిస్తే, ఒక ముక్క తీవ్ర మాంద్యంలో, రెండోది నిలకడ స్థితిలో, మూడోది అభివృద్ధి దిశగా ఉన్నట్లు వివరించారు. కొన్ని రాష్ట్రాలు వ్యోమింగ్, మాంటానా, మిన్నెసోటా, మిసిసిప్పీ, కాన్సాస్, మసాచుసెట్స్ మాంద్యం ముప్పులో ఉన్నాయని ఆయన స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోతల కారణంగా వాషింగ్టన్ డీసీ కూడా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోందని జాండీ అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యలు అంత తేలికగా తీసేయలేము. ఎందుకంటే, 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసిన వారిలో జాండీ ఒకరు. అప్పట్లో అమెరికాలోని ఆర్థిక మాంద్యం ప్రపంచమంతటినీ కుదిపేసిన విషయం అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతోందని జాండీ పేర్కొన్నారు. 2024 జూలైలో వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ద్రవ్యోల్బణం 0.2 శాతం పెరిగి 2.7 శాతానికి చేరుకుందని, వచ్చే ఏడాదికి ఇది 4 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల అమెరికన్ల కొనుగోలు శక్తి తగ్గిపోతుందని, వినియోగ వ్యయం 2008-09 స్థాయికి పడిపోయిందని చెప్పారు. ధరలు పెరగడం, వినియోగ శక్తి తగ్గడం రెండూ కలిసి ఆర్థిక వ్యవస్థను మరింత క్లిష్ట పరిస్థితిలోకి నెడతాయని ఆయన హెచ్చరిక జారీ చేశారు. మొత్తం మీద, మార్క్ జాండీ చేసిన విశ్లేషణలు అమెరికా భవిష్యత్తుపై పెద్ద అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ట్రంప్ తన ‘అగ్రరాజ్య’ అహంకారంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, అవి దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఇప్పటి పరిస్థితులు చెబుతున్నాయి. ఏదేమైనా ప్రపంచ దేశాలను శాసించే అమెరికాకు అన్ని దేశాల దిష్టి తగలడంతోనే ఇప్పుడు ఆ దేశం పతనం వైపు వెళుతుందన్న సెటైర్లు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో కనపడుతున్నాయి.