
రాష్ట్రంలో అధికార కూటమి ఐక్యతను, సమన్వయాన్ని ప్రజలకు బలంగా చాటిచెప్పేందుకు ఈ రోడ్‌షోను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఇప్పటికే శాసనమండలి లాబీల్లో మంత్రులు, ఎమ్మెల్సీలకు ఈ పర్యటన వివరాలు చెప్పి, తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇటీవల కేంద్రం అమలు చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు నేరుగా లాభం కలుగుతుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దాదాపు రూ.8 వేల కోట్ల మేర ఆదా అవుతుందని ఆయన అంచనా వేశారు. ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, సామాన్య కుటుంబాల వరకు ఈ ప్రయోజనాలు చేరతాయని తెలిపారు. ట్రాక్టర్లు, పాఠ్యపుస్తకాలు, మందులు, చేనేత వస్త్రాలు, బొమ్మలు వంటి అవసరమైన వస్తువులపై జీఎస్టీ తగ్గడం వల్ల ధరలు తగ్గి, కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పారు.
మోదీ పర్యటనలో భాగంగా పలువురు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలను ఈ పర్యటనలో హైలైట్ చేయబోతున్నారు. ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించడం వల్ల ఎగుమతులు పెరుగుతాయని మోదీ, బాబు, పవన్ త్రయం వేదికపై చెప్పే అవకాశముంది. ప్రధాని మోదీ చివరిసారి జూన్ నెలలో విశాఖపట్నంలో జరిగిన వరల్డ్ యోగా డే కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అప్పుడు జీఎస్టీ సంస్కరణలతో మరోసారి రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించేలా పర్యటన ప్రణాళిక సిద్ధమైంది. రాజకీయంగా కూడా ఈ పర్యటన కూటమి శక్తి ప్రదర్శనగా, వైసీపీపై ఒత్తిడి పెంచే అవకాశంగా మారనుంది. మొత్తానికి, అక్టోబర్ 16న జరిగే ప్రధాని మోదీ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ చేంజర్‌గా నిలవడం ఖాయం. అభివృద్ధి వాగ్దానాలతో పాటు కూటమి ఏకతాటిపై ఉందనే సందేశం ఇవ్వడానికి ఈ పర్యటన కీలకం కానుంది.