సృష్టిలో ఏ జీవి జన్మించినా, దానికి తొలి పోషణ, రక్షణ అందించేది తల్లి ఇచ్చే మొట్టమొదటి పాలు – అదే జున్ను పాలు (కొలొస్ట్రమ్). ప్రసవించిన తర్వాత మొదటి కొన్ని రోజులలో మాత్రమే ఈ పాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి సాధారణ పాల కంటే చాలా చిక్కగా, పసుపు రంగులో ఉంటాయి. కేవలం చిన్న పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఈ జున్ను పాలు ఎంతో మేలు చేస్తాయి.

జున్ను పాలలో ప్రధానంగా ఉండే అద్భుతమైన అంశం – అవి యాంటీబాడీలు (Immunoglobulins). ఇవి శిశువులకు తొలిరోజుల్లో రోగాల నుంచి రక్షణ కల్పించే రక్షక భటుల వంటివి. ముఖ్యంగా, ఇమ్యునోగ్లోబులిన్-ఏ అనే యాంటీబాడీ జీర్ణకోశాన్ని కప్పి ఉంచి, హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఇందులో ఉండే లాక్టోఫెర్రిన్ అనే ప్రోటీన్ యాంటీ-మైక్రోబయల్, యాంటీ-వైరల్ లక్షణాలను కలిగి ఉండి, శరీరంలో మంట (Inflammation)ను తగ్గిస్తుంది.

ఇందులో ఉండే పెరుగుదల కారకాలు (Growth Factors) పేగు గోడలను బలోపేతం చేసి, "లీకీ గట్ సిండ్రోమ్" వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణ పాల కంటే తక్కువ కొవ్వు, చక్కర ఉండటం వలన, ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది. నవజాత శిశువుల్లో, ప్రేగులలో పేరుకుపోయిన మొదటి మలం (మీకోనియం) తేలికగా బయటకు పోవడానికి జున్ను పాలు సహాయపడతాయి, తద్వారా పసిపిల్లలలో కామెర్లు (Jaundice) వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

కండరాల పెరుగుదల, కణజాల మరమ్మత్తుకు అవసరమైన ప్రోటీన్ రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ, జింక్, కాపర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఏ కంటి చూపు, చర్మ ఆరోగ్యానికి, జింక్ రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. జున్ను పాలు ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఆహారం అయినప్పటికీ, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా ఏదైనా సప్లిమెంట్‌గా తీసుకోవాలనుకునేవారు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.




మరింత సమాచారం తెలుసుకోండి: