ఏపీలో జగన్ క్యాబినెట్‌లో 25 మంత్రులున్న విషయం తెలిసిందే. మరి ఆ 25 మంత్రుల్లో ఎంతమంది మంచి పనితీరు కనబరుస్తున్నారు? అంటే మంత్రుల విషయంలో ప్రజలు ఏమి పెద్దగా సంతృప్తిగా లేరనే చెప్పొచ్చు. కేవలం జగన్‌తోనే ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పొచ్చు. సరే ఆ విషయం పక్కనబెడితే 25 మంత్రుల్లో ఎంతమంది ఎమ్మెల్యేలుగా తమ తమ నియోజకవర్గాల్లో అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారు? అంటే అది చెప్పడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలుగా ఆయా నియోజకవర్గాల్లో మంచి పనితీరు అయితే కనబర్చడం లేదని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా పినిపే విశ్వరూప్ ముందు వరుసలో ఉండొచ్చని చెబుతున్నారు. విశ్వరూప్ ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు....చాలా ఏళ్ళు కాంగ్రెస్‌లో పనిచేశారు. తర్వాత వైసీపీలోకి వచ్చేశారు.

ఇక 2019 ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు....అలాగే సీనియర్ కావడంతో జగన్ క్యాబినెట్లో చోటు దక్కింది...మరి మంత్రిగా విశ్వరూప్ పనితీరు ఎలా ఉందంటే? అంత గొప్పగా ఏమి లేదనే అంటున్నారు. అసలు విచిత్రం ఏంటంటే...మిగతా మంత్రులు పనితీరు కాకపోయినా, ప్రత్యర్ధులపై తీవ్ర విమర్శలు చేస్తూ హైలైట్ అవుతున్నారు. కానీ విశ్వరూప్ అలా కూడా హైలైట్ అవ్వడం లేదని అంటున్నారు. అసలు రాష్ట్రంలో కాస్త రాజకీయాలకు తెలిసినవాళ్ళకు తప్ప, మిగతా వాళ్ళకు విశ్వరూప్ మంత్రి అనే సంగతి కూడా తెలియదనే అంటున్నారు.

ఇక ఎమ్మెల్యేగా విశ్వరూప్ అమలాపురంలో అంత గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయడం లేదని చెబుతున్నారు. సంక్షేమ పథకాలు మాత్రమే ప్లస్ అవుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో కూడా వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. అంటే ఎమ్మెల్యేగా కూడా విశ్వరూప్ ఎఫెక్టివ్ గా లేరని తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ తరుపున మాజీ ఎమ్మెల్యే ఆనందరావు పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ టీడీపీ కాస్త స్ట్రాంగ్ అయింది. అదే సమయంలో జనసేన కూడా పికప్ అయింది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి 46 వేల ఓట్లు పడితే, జనసేనకు 45 వేల ఓట్లు పడ్డాయి. అయితే నెక్స్ట్ గనుక టీడీపీ-జనసేన కలిసొస్తే వైసీపీకి చెక్ పడిపోయేలా ఉంది.     


మరింత సమాచారం తెలుసుకోండి: