ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగా ఉన్న కొలుసు పార్థసారథికి ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి కష్టపడాల్సిందేనా? పెనమలూరు బరిలో మరొకసారి గెలవడం సారథికి కష్టమేనా? అంటే కాస్త అవుననే చెప్పొచ్చు. రెండున్నర ఏళ్లలో పెనమలూరులో రాజకీయం చాలా మారింది. ఎమ్మెల్యేగా ఉన్న సారథిపై పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది. వుయ్యూరు(నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) నుంచి ఒకసారి....పెనమలూరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సారథికి నాల్గవ సారి గెలిచే సత్తా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

రెండున్నర ఏళ్లలో సారథి పెనమలూరులో భారీ మార్పులు ఏమి తీసుకురాలేదు. అనుకున్న మేర అభివృద్ధి జరగలేదు. ఏదో సంక్షేమ పథకాలు అమలు బాగుంది గానీ, అభివృద్ధి అసలు లేదు. ప్రభుత్వం తరుపున గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగాయి గానీ, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి మాత్రం జరగలేదు. పైగా నియోజకవర్గంలో వైసీపీ నేతల అక్రమాలు ఎక్కువే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక, ఇళ్ల స్థలాల్లో వైసీపీ నేతలు పెనమలూరులో చేసిన అక్రమాలకు అంతు లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు సారథికి బాగా మైనస్ అవుతున్నాయి.  

పైగా పెనమలూరు రాజధాని అమరావతికి దగ్గరగా ఉంటుంది. దీంతో అమరావతి అంశం కూడా అతి పెద్ద మైనస్. ఇలా పెనమలూరులో సారథికి మైనస్‌లు ఎక్కువే కనిపిస్తున్నాయి. కాకపోతే సారథికి ఎప్పుడూ ప్రజల్లో ఉండటం, సంక్షేమ పథకాలు బాగా ప్లస్ అవుతున్నాయి. ఒకవేళ మంత్రి పదవి వస్తే నియోజకవర్గంలో అభివృద్ధి జరగొచ్చు. మరి సారథికి మంత్రి పదవి వస్తుందా లేదా అనేది చూడాలి.

అటు టీడీపీ తరుపున బోడే ప్రసాద్ దూకుడుగా పనిచేస్తున్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు...పెనమలూరులో టీడీపీని బలోపేతం చేస్తున్నారు. ఎలాగో ఇక్కడ కమ్మ వర్గం హవా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ బోడేకు గెలవడానికి మంచి ఛాన్స్ ఉంది. అదే సమయంలో టీడీపీకి జనసేన సపోర్ట్ ఇస్తే...బోడేకు ప్లస్ అవుతుంది. అప్పుడు నాల్గవ సారి సారథికి గెలిచే అవకాశాలు తగ్గుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: