హీరోయిన్ అనుష్క 15 సినీ ప్ర‌స్థానానికి సంబంధించిన ఫంక్షన్ కు హాజరైన అనేకమంది దర్శకులు అనుష్క మంచితనం గురించి ఎవరికీ తెలియని అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేస్తూ మాట్లాడి ఆ ఫంక్షన్ ను రక్తికట్టించారు.  ముఖ్యంగా రాఘ‌వేంద్ర‌రావు అనుష్క గురించి మాట్లాడుతూ షేర్ చేసిన ఒక ఆసక్తికర విషయం విని చాలామంది షాక్ అయ్యారు.


తాను ‘శ్రీ‌రామ‌దాసు’ చిత్రం తీస్తున్న‌ప్పుడు అనుష్క‌ను నాగార్జున ప‌రిచ‌యం చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ స్వీటీ అని నాగార్జున పిల‌వ‌గానే మెట్లు ఎక్కుతూ వ‌చ్చిన అనుష్క ను చూసి తనకు ఆరోజునే అనుష్క టాప్ హీరోయిన్ అవుతుంది అన్న అంచనాలు వచ్చిన విషయాన్ని వివరించాడు. ఇదే సందర్భంలో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మాట్లాడుతూ అనుష్క కేవ‌లం న‌టి మాత్ర‌మే కాద‌ని మంచి మ‌నస్సున్న అమ్మాయి అని అంటూ ఆమెను ఆకాశంలోకి ఎత్తేశాడు. 


ఇవన్నీ ఒక ఎత్తైతే నిర్మాత శ్యాంప్ర‌సాద్‌రెడ్డి లీక్ చేసిన ఒక విషయం అందరికీ షాక్ ఇచ్చింది. తాను ఆరు నెలల క్రితం ఒక పని నిమిత్తం జార్జియాకు వెళ్ళినప్పుడు జాజా అనే ర‌ష్యాకు చెందిన వ్యక్తి తనకు పరిచయం అయిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ తాము హైద‌రాబాద్ నుంచి వ‌చ్చామ‌ని చెప్పగానే అతడు వెంట‌నే స్వీటీ తెలుసా అని ప్ర‌శ్నించిన విషయాన్ని బయటపెట్టాడు. 


అతడు గతంలో అనుష్క ఒక సినిమా షూటింగ్ కోసం జార్జియా వెళ్ళినప్పుడు అతడు అనుష్క కారుకు డ్రైవర్ గా పనిచేసాడట. అయితే ఒక‌రోజు జాజాకు బ‌దులుగా మ‌రో వ్య‌క్తి కారు తీసుకుని అనుష్క వద్దకు వెళితే జాజ ఏమయ్యాడు అంటూ ఆమె ప్రశ్నించిందట. అప్పుడు జాజా కారును ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లార‌ని అనుష్క తెలుసుకుని వెంటనే జాజాను పిలిపించి అతడిని స్వయంగా తీసుకు వెళ్లి అతడికి ఒక కారును కొనిపెట్టి ఇచ్చి వ్యాపారం చేసుకోమని చెప్పిందట. ఈ విషయాన్ని స్వయంగా శ్యాంప్ర‌సాద్‌ రెడ్డి బయటపెడుతూ ఇండస్ట్రీలో అనుష్క లాంటి మంచి అమ్మాయిలు చాల తక్కువమంది ఉంటారు అంటూ కామెంట్ చేసాడు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: