ల్యాప్‌టాప్ అనేది నేడు మన జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయింది. అయితే దీనిని ఉపయోగించినంత జాగ్రత్తగా శుభ్రం చేయడంలో చాలామంది అశ్రద్ధ వహిస్తుంటారు. అవగాహన లేక చేసే చిన్న చిన్న పొరపాట్లు మీ ల్యాప్‌టాప్ జీవితకాలాన్ని తగ్గించడమే కాకుండా, శాశ్వతంగా పాడయ్యేలా చేస్తాయి. ల్యాప్‌టాప్‌ను క్లీన్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అది రన్నింగ్‌లో ఉన్నప్పుడు లేదా చార్జింగ్‌కు కనెక్ట్ అయి ఉన్నప్పుడు పొరపాటున కూడా శుభ్రం చేయకూడదు. ముందుగా ల్యాప్‌టాప్‌ను షట్‌డౌన్ చేసి, పవర్ కేబుల్‌ను తొలగించాలి. వీలైతే బ్యాటరీని కూడా తీసివేయడం ఉత్తమం. క్లీనింగ్ కోసం ఎప్పుడూ నేరుగా నీటిని గానీ, గ్లాస్ క్లీనర్లను గానీ ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై లేదా కీబోర్డ్‌పై స్ప్రే చేయకూడదు. ఇలా చేయడం వల్ల ద్రవ పదార్థాలు కీబోర్డ్ కీస్ లోపలికి లేదా స్క్రీన్ అంచులలోకి వెళ్లి షార్ట్ సర్క్యూట్‌కు దారితీస్తాయి.

చాలామంది ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను తుడవడానికి ఇంట్లో ఉండే పాత తువ్వాళ్లు, పేపర్ నాప్కిన్లు లేదా టీషర్ట్ ముక్కలను వాడుతుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. వీటిలోని గరుకుదనం వల్ల స్క్రీన్‌పై శాశ్వతంగా గీతలు (scratches) పడే అవకాశం ఉంది. ఎప్పుడూ మెత్తటి మైక్రోఫైబర్ క్లాత్‌ను మాత్రమే వాడాలి. అలాగే మొండి మరకలు ఉన్నప్పుడు కూడా స్క్రీన్‌ను బలంగా రుద్దకూడదు, ఇది డిస్‌ప్లే ప్యానెల్‌ను దెబ్బతీస్తుంది. క్లీనింగ్ లిక్విడ్ వాడాలనుకుంటే, దానిని నేరుగా క్లాత్‌పై కొద్దిగా చల్లి, ఆ తడి క్లాత్‌తో మృదువుగా తుడవాలి. కీబోర్డ్ గ్యాప్‌లలో పేరుకుపోయిన ధూళిని తొలగించడానికి హెయిర్ డ్రైయర్లను వాడటం ప్రమాదకరం. హెయిర్ డ్రైయర్ నుండి వచ్చే వేడి గాలి ల్యాప్‌టాప్ లోపల ఉండే సున్నితమైన ప్లాస్టిక్ భాగాలను కరిగించవచ్చు. దీనికి బదులుగా సాఫ్ట్ బ్రష్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ కాన్‌లను ఉపయోగించడం మంచిది. చివరగా, ల్యాప్‌టాప్ పూర్తిగా ఆరిపోయే వరకు దానిని ఆన్ చేయకూడదు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ ల్యాప్‌టాప్ కొత్తదానిలా మెరవడమే కాకుండా ఎక్కువ కాలం మన్నిక వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: