దాసరి నారాయణరావు మరణం తరువాత ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి కొనసాగుతున్నాడు. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా ఇప్పుడు అందరు చిరంజీవి పెద్దరికం కోసం ఆశిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి ముఖ్యమంత్రి కేసిఆర్ కరోనా సమస్య మరింత పెరగకుండా ధియేటర్లు మూసివేయాలని చేసిన నిర్ణయం పై స్పందిస్తూ చిరంజీవి కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతించడమే కాకుండా తన ‘ఆచార్య’ మూవీ షూటింగ్ ను కూడ నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించి ఇండస్ట్రీలోని అన్ని వర్గాల వారు కెసిఆర్ ప్రయత్నాలకు మద్దతు తెలపవలసిందిగా కోరిన విషయం తెలిసిందే.


ఈ ప్రకటన చిరంజీవి నుండి వచ్చి ఒక రోజు గడవకుండానే కృష్ణానగర్ లో ఉండే అనేకమంది ఎక్స్ ట్రా ఆర్టిస్టులకు అసహనాన్ని కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఫిలిం ఇండస్ట్రీలో చిన్నచిన్న వేషాలు వేసుకుంటూ ఎక్స్ ట్రా ఆర్టిస్టులుగా జీవితాలను గడిపే చాల మందికి ఏరోజు షూటింగ్ లేకపోయినా వారికి రోజు గడవని పరిస్థితి.


చిరంజీవి పద్ధతిని అనుసరిస్తూ ప్రస్తుతం భాగ్యనగరంలో తెలుగు రాష్ట్రాలలో షూటింగ్ లు కొనసాగిస్తున్న నిర్మాతలు అందర్ని షూటింగ్ లు రద్దు చేసుకోవలసిందిగా ‘మా’ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోరడంతో పాటు మా సభ్యులు ఎవరు ఈ షూటింగ్ లలో పాల్గొనవద్దని మా పిలుపు ఇచ్చింది. ఇలా కరోనా భయాలతో షూటింగ్ లు నిలిపి వేస్తే ఈ పదిహేను రోజులు తాము ఎలా బతకాలి అంటూ చాలామంది ఎక్స్ ట్రా ఆర్టిస్టులు గగ్గోలు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు తిరిగి షూటింగ్ లు మొదలయ్యే వరకు కనీసం తమ రోజువారి అవసరాలు తీర్చడానికి ఇండస్ట్రీలోని పెద్దలు అందరు తమకు ఆర్ధిక సహాయం చేసే విషయంలో చిరంజీవి పూనుకుని సహాయపడితే బాగుంటుందని వీరంతా అభిప్రాయపడుతున్నారు.


చిరంజీవి పెద్దరకంతో కెసిఆర్ ను ప్రశంసిస్తూ చేసిన ప్రకటన అనుకోకుండా ఇలా ఎక్స్ ట్రా ఆర్టిస్టులకు సమస్యగా మారడంతో చిరంజీవి ఇప్పుడు తన పెద్దరికాన్ని నిలుపుకుంటే బాగుంటుందని ఇండస్ట్రీలో పనిచేసే 24 క్రాఫ్ట్స్ కు చెందినా వారు కూడ చిరంజీవిని అభ్యర్దిస్తున్నట్లు టాక్. ఇప్పటికే ‘ఆచార్య’ రకరకాల కారణాలతో వాయిదా పడుతూ చిరంజీవికి టెన్షన్ కలిగిస్తున్న పరిస్థితులలో ఈ ఎక్స్ ట్రా ఆర్టిస్టుల సమస్యలను పెద్ద మనసు చేసుకుని ఇండస్ట్రీ పెద్దగా ఎలా పరిష్కరిస్తాడో లేదో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: