ప్రపంచంలోని దేశాలన్నింటినీ కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ సినీ ప్రముఖులను, రాజకీయ ప్రముఖులను కూడా వదిలిపెట్టడం లేదు. సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకు ఈ వైరస్ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. 
 
బాలీవుడ్, హాలీవుడ్ నటులలో చాలామంది కరోనా భారీన పడుతున్నారు. కొందరు కరోనా నుంచి కోలుకుంటుండగా మరికొందరు మాత్రం చికిత్సకు కోలుకోలేక మృతి చెందుతున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే ఇద్దరు హాలీవుడ్ స్టార్స్ తమ ప్రాణాలు కోల్పొయారు. తాజాగా హాలీవుడ్ ప్రముఖ నటుడు నిక్ కార్డెరోకు కరోనా సోకింది. ఈ వైరస్ దెబ్బకు నిక్ తన కాలునే కోల్పోవాల్సి వచ్చింది. 
 
ఈ విషయం తెలిసిన నిక్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. లాస్ ఏంజిల్స్ లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న నిక్ కుడి కాలుకు ఇన్ఫెక్షన్ రావడంతో రక్తం గడ్డ కట్టి, ముక్కలుగా విడిపోయింది. ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ అయితే ఊపిరితిత్తులు మరియు గుండెకు ప్రమాదం అని భావించి వైద్యులు నిక్ కుటుంబ సభ్యుల అనుమతితో కాలు తొలగించారు. నిక్ సతీమణి అమందా తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు కాలు తొలగించారని మీడియాకు చెప్పారు. 
 
త్వరలోనే నిక్ కోలుకుంటాడని వైద్యులు చెప్పారని ఆమె మీడియాకు తెలిపారు. నిక్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. హాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా నిక్ గుర్తింపు తెచ్చుకున్నారు. కాలు తొలగించడంతో నిక్ సినిమాలకు దూరమైనట్లే అని వారు చెబుతున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 34 లక్షలు దాటగా మృతుల సంఖ్య 2,50,000 కు చేరువలో ఉంది. కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రపంచదేశాలన్నీ వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ పై ఆధారపడ్డాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: