నేడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి. కృష్ణ జయంతి కావడంతో మహేశ్ బాబు ఆయనని తలుచుకుంటూ ఉదయాన్నే ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. ఇక కృష్ణ జయంతి కానుకగా మహేష్ నెక్స్ట్ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు.

మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. మహేశ్ కి తండ్రితో చాలా మంచి అనుబంధం ఉంది. మహేశ్ ని హీరోగా నిలబెట్టింది, సినిమాల్లోకి తీసుకువచ్చింది కృష్ణనే. మహేశ్ హీరో అవ్వకముందే బాలనటుడిగా పలు సినిమాల్లో నటించాడు. అందులో చాలా వరకు తన తండ్రి కృష్ణతో కలిసి నటించడం విశేషం.

సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు కలిసి 10 సినిమాల్లో నటించారు. అందులో మహేశ్ బాలనటుడిగా ఉన్నప్పుడు ఏడు సినిమాల్లో నటిస్తే, హీరో అయ్యాక మూడు సినిమాల్లో కలిసి నటించారు.

మహేశ్ బాబు తన తండ్రి కృష్ణతో కలిసి మొదటిసారి పోరాటం అనే సినిమాలో నటించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృష్ణ, మహేశ్ బాబు అన్నదమ్ములుగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

మహేశ్ బాబు కృష్ణతో కలిసి శంఖారావం సినిమాలో నటించగా ఇది కృష్ణ సొంత దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో వీరిద్దరూ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

రమేష్ బాబు, మహేశ్ బాబు కలిసి నటించిన సినిమా బజారు రౌడీ. ఈ సినిమాలో మహేశ్ బాబు కృష్ణ ఫ్యాన్ గా కనిపిస్తారు. ఇందులో కృష్ణ తన పాత్రలో హీరోగానే కొద్దిసేపు కనిపిస్తారు. ఈ సినిమాని కోదండరామిరెడ్డి తెరకెక్కించారు.

కృష్ణ దర్శకత్వంలో కృష్ణ, మహేశ్ బాబు, రమేష్ బాబు కలిసి నటించిన సినిమా ముగ్గురు కొడుకులు. ఈ సినిమాలో కృష్ణకు తమ్ముల్లుగా నటించారు రమేష్, మహేశ్. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

మహేశ్ బాబు తన తండ్రి కృష్ణతో కలిసి గూఢచారి 117 సినిమాలో నటించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేశ్ బాబు కృష్ణతో పాటు సమానంగా డ్యాన్సులు, ఫైట్స్ చేసి చిన్నప్పుడే మెప్పించాడు.

మహేశ్ బాబు డ్యూయల్ రోల్ లో తన తండ్రి కృష్ణతో కలిసి నటించిన సినిమా కొడుకు దిద్దిన కాపురం. ఈ సినిమా కృష్ణ దర్శకత్వంలోనే తెరకెక్కింది. ఈ సినిమాలో మహేశ్, కృష్ణ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ సినిమా భారీ విజయం సాధించింది.

మహేశ్ బాలనటుడిగా చివరిసారి కృష్ణతో కలిసి నటించిన సినిమా అన్నాతమ్ముడు. ఈ సినిమా కూడా కృష్ణ దర్శకత్వంలోనే తెరకెక్కింది.

మహేశ్ బాబు హీరోగా నటించిన మొదటి సినిమా రాజకుమారుడులో కృష్ణ కొద్దిసేపు కనిపిస్తారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

మహేశ్, నమ్రత జంటగా నటించిన వంశీ సినిమాలో కూడా కృష్ణ నటించారు. బి.గోపాల్ ఈ సినిమాని తెరకెక్కించారు. చివరిసారిగా మహేశ్, కృష్ణ కలిసి టక్కరిదొంగ సినిమాలో నటించారు. ఈ సినిమాలో కృష్ణ క్లైమాక్స్ లో కనిపిస్తారు. ఇలా మహేశ్ బాబు, కృష్ణ దాదాపు 10 సార్లు కలిసి నటించి అభిమానులని, ప్రేక్షకులని మెప్పించారు. ఇక రియల్ లైఫ్ లో ఎన్నో సార్లు స్టేజిపై, బయట ఇద్దరూ కలిసి కనిపించి అభిమానులను కనువిందు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: