బాలయ్య సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో వీరసింహారెడ్డి ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది.గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ గా నటించి మెప్పించారు. కన్నడలో దునియా విజయ్ కు మంచి పేరు ఉంది. అక్కడ హీరోగా దునియా విజయ్ ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు.వీరసింహారెడ్డి మూవీలో ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో నటించి ఆ పాత్రకు ప్రాణం పోసిన దునియా విజయ్ కొన్నిరోజుల క్రితం స్వగ్రామం కుంబరనహళ్లిలో పర్యటించడంతో పాటు అక్కడి స్థానికులతో మాట్లాడారు. ఈరోజు దునియా విజయ్ పుట్టినరోజు కాగా పుట్టినరోజు వేడుకలను సైతం దునియా విజయ్ స్వగ్రామంలో జరుపుకుంటున్నారు. అయితే ఆ గ్రామంలో కొన్ని కుటుంబాలకు చెందిన వ్యక్తులు వేర్వేరు కారణాల వల్ల జైలు జీవితం గడుపుతున్నారని విజయ్ కు తెలిసింది.

  అయితే ఆ కుటుంబ సభ్యుల కన్నీటి కష్టాల గురించి తెలుసుకున్న విజయ్ ఆ కుటుంబాలకు న్యాయం జరగాలని ఆలోచించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరుగురు ఖైదీలను జైలు నుంచి విడిపించి మంచి మనస్సును చాటుకున్నారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలను విజయ్ విడుదల చేయించడంతో ఖైదీల కుటుంబ సభ్యులు ఎంతో సంతోషిస్తున్నారు.కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తులు తమతో లేకుండా జీవించడం చాలా కష్టమని అలాంటి బాధ ఎవరికీ రాకూడదని దునియా విజయ్ చెప్పుకొచ్చారు. గతంలో జరిమానా చెల్లించి పలువురు వృద్ధ ఖైదీలను దునియా విజయ్ జైలు నుంచి విడుదల చేయించిన సందర్భాలు సైతం ఉన్నాయి. తన స్వగ్రామంలోని ఆరుగురు ఖైదీలు జరిమానా చెల్లించలేక జైలు జీవితం గడుపుతుండటంతో దునియా విజయ్ ఆ మొత్తాన్ని చెల్లించి వాళ్లను కస్టడీ నుంచి విడిపించారు. ప్రస్తుతం గోపీచంద్ భీమ్ మూవీలో దునియా విజయ్ నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: