నారా రోహిత్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రాల్లో 'ప్రతినిధి' సినిమా ఒకటి. 2014లో వచ్చిన ఈ పొలిటికల్ డ్రామా అప్పుడు మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే ఫ్రాంచైజీలో రెండో సినిమాగా "ప్రతినిధి 2" సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కింది. ఈరోజు (మార్చి 29) శుక్రవారం మూవీ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు.'5.. 4.. 3.. 2.. 1.. గో' అంటూ న్యూస్ రూమ్ లో ఉదయ భాను కౌంట్ డౌన్ స్టార్ట్ చేయడంతో ఈ టీజర్ స్టార్ట్ అవుతుంది. రాష్ట్ర అభివృద్ధి, అప్పులు వంటి పొలిటికల్ అంశాలను ప్రస్తావిస్తూ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. టీజర్ లో చూస్తే హీరో నారా రోహిత్ ఒక టీవీ ఛానెల్‌లో పనిచేసే నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ గా కనిపించారు. రాజకీయ నాయకుడైన అజయ్ ఘోష్ ను ఇంటర్వ్యూ చేస్తూ, రాష్ట్ర అప్పుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇక దానికి అతను 5 లక్షల కోట్లు అప్పు ఉందని బదులిస్తాడు.'అంత అప్పు తీర్చాలంటే ఎంత టైం పడుతుంది సార్' అని హీరో అడగ్గా.. అభివృద్ధి జరిగితే అవి తీరడానికి ఎంతో సమయం పట్టదని దానికి సమాధానమిస్తాడు. 


దీనికి వెంటనే 'అభివృద్ధి ఎక్కడుంది సార్?' అంటూ నారా రోహిత్ నవ్వుతూ అతన్ని ప్రశ్నించడంతో ఈ టీజర్ ఆసక్తికరంగా మారుతుంది. చివర్లో "ఇప్పటికైనా కళ్లు తెరవండి, ఒళ్ళు విరిచి బయటకు వచ్చి ఓటు వెయ్యండి. లేదంటే ఈ దేశం వదిలి వెళ్లిపోండి. అదీ కుదరకపోతే చచ్చిపోండి" అంటూ హీరో సీరియస్ గా హెచ్చరిస్తూ, ఓటు విలువను తెలియజెప్పడం టీజర్ లో హైలైట్ గా నిలిచింది.టీజర్ లో 'జనం కోసం బ్రతికితే చచ్చాక కూడా జనంలోనే బ్రతికి ఉంటాం' వంటి డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. 'పైన కూర్చొని నీతులు ఎన్నైనా చెప్తావ్.. మేము ఖర్చు పెట్టిందంతా ఎవరిస్తారు? వాడా.. వాడెమ్మ మొగుడా' అని రఘుబాబుతో పలికించడం ద్వారా ప్రస్తుత రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తున్నట్లు టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది. పైగా ఇందులో యాక్షన్ పాళ్లు కూడా ఎక్కువగా ఉన్నాయని టీజర్ లోనే హింట్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: