పవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త! ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' సినిమాకు తెలంగాణ రాష్ట్రంలో కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. మొదట్లో ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే టికెట్ ధరలు పెరుగుతాయని అందరూ భావించినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులకు సంతోషాన్ని కలిగించింది.

ఈ నెల సెప్టెంబర్ 24వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈ ప్రీమియర్ షో కోసం జీఎస్టీతో కలిపి రూ. 800 టికెట్ ధరను నిర్ణయించడం జరిగింది. ఇది సినిమాపై ఉన్న అంచనాలను, అభిమానుల ఉత్సాహాన్ని తెలియజేస్తోంది.

ప్రీమియర్ షోతో పాటుగా, ఈ నెల సెప్టెంబర్ 25వ తేదీ నుండి అక్టోబర్ 4వ తేదీ వరకు టికెట్ రేట్ల పెంపునకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 100, మల్టిప్లెక్స్‌లలో రూ. 150 వరకు జీఎస్టీతో కలిపి అదనంగా పెంచుకోవడానికి అనుమతి లభించింది. ఈ నిర్ణయం సినిమా నిర్మాతలకు, పంపిణీదారులకు లాభాలను పెంచే అవకాశం కల్పించింది.

ఈ టికెట్ రేట్ల పెంపునకు ప్రధానంగా నిర్మాత దిల్ రాజు చేసిన కృషి కారణమని సినీ వర్గాల సమాచారం. ఆయన చొరవ వల్లనే తెలంగాణ ప్రభుత్వ అనుమతులు లభించాయని తెలుస్తోంది. ఈ నిర్ణయం 'ఓజీ' సినిమాకు భారీగా వసూళ్లను తెచ్చిపెడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా విడుదల కోసం కేవలం అభిమానులే కాకుండా, సినీ పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టికెట్ రేట్ల పెంపు నేపథ్యంలో ఓజీ సినిమా ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. ఓజీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పరిస్థితులు అనుకూలంగా  ఉన్నాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా క్రియేట్ చేసే సంచలనాలు మాములుగా ఉండవు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: