కాకతాళీయమే అయినా టాలీవుడ్‌లో వచ్చే కొన్ని క్లాషులు అభిమానులకు అసలైన పండుగలా మారతాయి. రాబోయే 2026 సంక్రాంతి నుంచి ఏప్రిల్ వరకు సితార ఎంటర్‌టైన్మెంట్స్ ప్రాజెక్టుల పోటీ యమా రంజుగా ఉండనుంది. ఈ బ్యానర్ ప్రస్తుతం ఆరేడు సినిమాలను ఒకేసారి నిర్మిస్తోంది. వాటి విడుదల తేదీలు సెట్ చేయడం నిర్మాత నాగవంశీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఒక్కో సినిమాకు సరైన సీజన్, సరైన థియేటర్లు దొరకడం పెద్ద సవాల్. ముందుగా సంక్రాంతి రేస్‌లో సితార ఎంటర్‌టైన్మెంట్స్ నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కించిన అనగనగా ఒక రాజు సినిమా ఉంది. ఈ సినిమాను జనవరి 14న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే అదే సమయానికి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న శంకరవరప్రసాద్ కూడా థియేటర్లలోకి వస్తోంది. రెండూ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ సినిమాలే కావడంతో సంక్రాంతి బరిలో పోరు ఆసక్తికరంగా మారనుంది.
సితార తాజాగా మరో డేట్ క్లాష్‌కి సై చెప్పింది. విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ కెవి దర్శకత్వంలో రూపొందుతున్న ఫంకీ సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి కేవలం వారం ముందే మార్చి 27న రామ్ చరణ్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పెద్ది విడుదల కానుంది. ఆ సినిమాకి ఉన్న హైప్ నేపథ్యంలో బాక్సాఫీస్‌ను కనీసం రెండు మూడు వారాలపాటు డామినేట్ చేయడం ఖాయం. అయినా సితార బ్యానర్ ఫంకీని అదే టైంలో రిలీజ్ చేయడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు మెగాపవర్ స్టార్ పోటీకి సిద్దమవుతుంటే, మరోవైపు మెగా పవర్‌స్టార్‌తో పోటీకి వెళుతోంది.
అదీ కాక, ఫంకీకి నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమా నుంచి కూడా పోటీ ఉంది. కొంచెం వెనక్కి వెళ్తే, ఇదే నాగవంశీ భీమ్లా నాయక్ సినిమాను ఆర్ఆర్ఆర్ తో ఒకే సీజన్‌లో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు “బాబాయ్ అబ్బాయి క్లాష్ ఎందుకు?” అని మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యపోయినా, ఆయన వెనక్కి తగ్గలేదు. తర్వాత రెండు సినిమాలు డేట్లు మార్చుకున్నా, నాగవంశీ ధైర్యానికి పేరొచ్చింది. ఇప్పుడు కూడా అదే ధైర్యం కనబరుస్తున్నట్టే కనిపిస్తోంది. అయితే మాస్ జాతర, కింగ్డమ్ వంటి సితార ప్రాజెక్టులు వాయిదాలు వేసిన విషయం గుర్తు చేసుకుంటే, ఈసారి అనుకున్న డేట్లకే సినిమాలు రిలీజ్ చేస్తారా ? అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి