జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో మత రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అన్ని పార్టీలు ముస్లింల ఓటు బ్యాంక్‌పై కన్నేశాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముస్లిం వర్గాలను పాంపర్ చేస్తూ, తమకు మద్దతు కల్పించాలంటూ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కూడా “మేమే ముస్లింల మద్దతుదారులం” అని ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. ముస్లింల ఓటర్లు ఈ నియోజకవర్గంలో లక్షకు పైగా ఉన్నారు. వారు క్రమశిక్షణతో ఓటు వేస్తారు అన్న నమ్మకం అన్ని పార్టీలకూ ఉంది. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఈ వర్గాన్ని ఆకట్టుకోవడంలో పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్‌కు సంప్రదాయంగా ముస్లింల మద్దతు లభిస్తుంటుంది. అదనంగా ఎంఐఎం కూడా ఈసారి కాంగ్రెస్‌తో కలసి కదులుతోందని ప్రచారం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ ఓటు బ్యాంక్‌లో కొంత చీలిక తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.


ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ మాత్రం భిన్నమైన వ్యూహాన్ని అవలంబిస్తోంది. ముస్లింలను ఆకట్టుకోవడం కంటే హిందూ ఓటర్లను ఏకం చేయడంపైనే దృష్టి పెట్టింది. ముఖ్యంగా బండి సంజయ్ హిందూ సమాజాన్ని కదిలించే రీతిలో ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. బోరబండలో జరిగిన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా హిందూ వర్సెస్ ముస్లిం రాజకీయాలను తెరమీదకు తెచ్చాయి. ఆయన ప్రసంగాలు ముస్లిం వర్గాలకు కోపం తెప్పిస్తున్నా హిందూ ఓటర్లలో “ బీజేపీ మన కోసం పోరాడుతోంది ” అనే భావన పెంచుతున్నాయి. ఇలా కొద్దిపాటి ఓటు మార్పు కూడా ఫలితాలపై పెద్ద ప్రభావం చూపవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం బండి సంజయ్‌ తరహా హిందూ రాజకీయాలను దూరంగా ఉంచి, అభివృద్ధి, పరిపాలన అంశాలపైనే ప్రచారం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన పద్ధతి సమతుల్యంగా ఉన్నప్పటికీ, బండి సంజయ్ వ్యాఖ్యల వల్ల పార్టీకి రెండు సంకేతాలు వెళ్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. జూబ్లిహిల్స్ ప్రజలు మాత్రం ఈ రాజకీయ తగాదాలకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పార్టీల హడావుడి, పెద్ద పెద్ద సభలు జరుగుతున్నా, సాధారణ ప్రజలు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవరి నాయకుడు ఏమన్నారన్న దానికంటే స్థానిక సమస్యల పరిష్కారమే తమకు ముఖ్యం అని భావిస్తున్నారు. చివరికి ఓటింగ్ శాతం, ఏ ఏరియాల్లో ఎక్కువ ఓట్లు పడతాయన్నదే ఫలితాలను నిర్ణయించే కీలక అంశం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: