జూబ్లిహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఈసారి గందరగోళంగా మారాయి. జనసేన పార్టీ మద్దతు కోరుతూ ఆ పార్టీ నేతలతో కలిసి ప్రచారం చేస్తూ బీజేపీ నేతలు బిజీగా ఉన్నా.. తెలుగుదేశం పార్టీ మద్దతు మాత్రం కోరకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టీడీపీ మద్దతు లభిస్తే ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం కేవలం జనసేనతోనే సరిపెట్టుకోవడమే కాకుండా, టీడీపీతో దూరంగా ఉండటం వెనుక రాజకీయ లెక్కలు దాగి ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు ఖాయం అయిన తర్వాత టీడీపీ మద్దతు అంశం బాగా చర్చకు వచ్చింది. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా “ కేటీఆర్ స్వయంగా నారా లోకేష్‌ను కలిశారు ” అని ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల మధ్య బీఆర్ఎస్ మాత్రం మాగంటి సునీతకు టిక్కెట్ ఇవ్వడమే సరైన నిర్ణయమని భావించింది.
ఆమె భర్త మాగంటి గోపీనాథ్ గతంలో టీడీపీ నేతగా ఉన్నారు. ఆయన పార్టీ మారినా, టీడీపీపై ఎప్పుడూ విమర్శలు చేయలేదు. ఈ నేపధ్యంలో సునీతకు అవకాశం ఇస్తే టీడీపీ మద్దతు లభిస్తుందని బీఆర్ఎస్ భావించినట్లు సమాచారం. అయితే బీజేపీ వైఖరి మాత్రం సందిగ్ధంగా ఉంది. అభ్యర్థిని చివరి నిమిషం వరకు ప్రకటించకపోవడం, తర్వాత చురుకైన ప్రచారం చేయకపోవడం వంటి చర్యలు ఆ పార్టీ బీఆర్ఎస్‌కు పరోక్షంగా సహకరిస్తోందన్న అనుమానాలు తెప్పిస్తున్నాయి. బీజేపీ నేతలు టీడీపీ మద్దతు బహిరంగంగా అడిగితే, టీడీపీ సానుభూతిపరులు బీజేపీ వైపుకు మొగ్గుతారని, దాంతో మాగంటి సునీతకు నష్టం కలగొచ్చని భావించి మౌనం వహిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
అదే సమయంలో బీజేపీ జనసేనతో కలసి ప్రచారం చేస్తూ ఉండడం ప్రశ్నార్థకంగా మారింది. జనసేనతో కూటమి ఏపీలో ఉన్నా, టీడీపీతో కలిస్తే ఆ పొత్తు తెలంగాణకు కూడా విస్తరించిందని ప్రచారం జరుగుతుందని భయపడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. చివరికి టీడీపీ మద్దతు ప్రకటించకపోయినా, ఆ పార్టీ సానుభూతిపరులు మాగంటి సునీతకే ఓటు వేస్తారని భావన బలపడుతోంది. మొత్తానికి ఈ ఉపఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు స్పష్టత లేకుండా సాగుతుండగా, బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య అసలు పోటీ ఉత్కంఠగా మారుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి