నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్ ఎంతో మందిని భావోద్వేగానికి గురిచేసింది అనేది అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో, క్లైమాక్స్ చూస్తున్నప్పుడు భావోద్వేగాలు అదుపు చేసుకోలేక ఒక యువతి థియేటర్‌లోనే దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ను కలిసి తన చున్నీని తీసేసి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ సంఘటనను ప్రేక్షకులు రికార్డ్ చేయగా, గీతా ఆర్ట్స్ కూడా అధికారికంగా ఆ వీడియోను షేర్ చేయడంతో అది మరింతగా చర్చనీయాంశమైంది.


అయితే, ఈ వీడియోపై కొంతమంది నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “చున్నీ తీసేయడం ఎలా విమెన్ ఎంపవర్‌మెంట్ అవుతుంది?”, “అది మహిళల భద్రతకు, గౌరవానికి ప్రతీక. దాన్ని తీసేయడాన్ని డైరెక్టర్ ప్రశంసించడం ఎలా సరైన పని అవుతుంది?” అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. సినిమాలో రష్మిక దుపట్టాతోనే కనిపించిందని, బయట అమ్మాయిలు సంప్రదాయాలు పాటిస్తారని, రియల్ లైఫ్ ఆచారాలను మార్చమని సినిమాలో ప్రోత్సహించడం తగదని కొందరు తమ అభిప్రాయాలు వెల్లడించారు.



ఈ విమర్శల నేపథ్యంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తాజాగా స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆయన రియాక్ట్ అవుతూ:“థియేటర్‌లో జరిగిన సంఘటన పూర్తిగా యాదృచ్ఛికం. అది మా టీమ్ ప్రణాళిక కాదు. రెండు థియేటర్ల మధ్య గందరగోళంలో ఉండగా అనుకోకుండా ఆ షోకు వెళ్లాం. అప్పుడే అది అలా జరిగిపోయింది.  ఆ అమ్మాయిని కూడా అప్పుడే మొదటిసారి కలిశాం. ఆ వీడియోను షేర్ చేయడానికి మొదట నాకు భయం వేసింది. ఎందుకంటే ఒక చిన్న వర్గం ఆ యువతిని టార్గెట్ చేస్తుందని ముందే ఊహించాను. చివరకు అదే జరిగింది. సినిమాలో 'చున్నీ'ని కేవలం ఒక సీన్ యొక్క భావాన్ని వ్యక్తపరచడానికి మాత్రమే ఉపయోగించాం. ఎవరినీ దుపట్టా తీసేయమని, లేదా అలాంటి పనిని ప్రోత్సహించమని సినిమా చెప్పడం లేదు. పురుషులు పండగల్లో, క్రీడా వేడుకల్లో ఆనందంతో చొక్కాలు తీసేసినా ఎవరూ ప్రశ్నించరు. కానీ మహిళలు తమ వ్యక్తీకరణను చూపితే మాత్రం ‘సంస్కృతి’ పేరుతో విమర్శలు రావడం బాధాకరం. సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ఎందుకు ఎప్పుడూ మహిళలకే?” అని రాహుల్ అభిప్రాయపడ్డారు. అంతేకాక, “ఈ సంఘటనే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఎందుకు అవసరమో స్పష్టంగా చెప్పుతోంది. మహిళలు ఎలా భావిస్తారో, ఏ ఒత్తిడుల్లో బ్రతుకుతారో సమాజం అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది” అని దర్శకుడు వివరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: