కాలం గడుస్తూ, తరాలు మారినా కూడా రాముడి రూపం అంటే ఎన్టీఆర్ గారి ప్రతిబింబమే గుర్తొచ్చేది. ఆ ఇమేజ్‌ను బ్రేక్ చేసి, కొత్త రాముడిని ప్రేక్షకులకు ఒప్పించడం అసలు చిన్న విషయమేం కాదు. అయితే ఈ మహత్తర కర్తవ్యాన్ని దర్శక జంట ‘బాపు–రామానాయుడు’ చక్కగా సాధించారు. సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబు గారిని రాముడిగా అవిష్కరించిన తీరు, ఆయనలోని సౌమ్యతను, శాంతతను తెరపై నిలిపిన విధానం ప్రేక్షకులను పూర్తిగా మెప్పించింది. ఫలితంగా, ఎన్టీఆర్ తర్వాత రాముడి రూపంలో మనసుకు చేరిన నటుడు శోభన్ బాబే అని చెప్పాలి.
అయితే దశాబ్దాలు గడచిన తరువాత, మరోసారి రాముడి రూపాన్ని అద్భుతంగా ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నది రాజమౌళి. మహేష్ బాబును రాముడిగా చూపించబోతున్నారని చెప్పినప్పుడల్లా అందరిలోనూ ఒక చిన్న సందేహం ఉన్నది – ‘కొంటె కృష్ణుడిలా కనిపించే మహేష్, సౌమ్యుడైన రాముడిగా సరిగ్గా సెట్ అవుతాడా?’ అన్న ప్రశ్న. కానీ రాజమౌళి చెప్పిన మాటలు ఆ సందేహాలన్నింటికీ సమాధానం చెప్పాయి. ఒక కీలకమైన ఎపిసోడ్ కోసం చేసిన ఫోటోషూట్ చూసిన తరువాత తనే ఆశ్చర్యపోయి, ఆ ఫోటోను వాల్‌పేపర్‌గా పెట్టుకున్నానని, మరెవరైనా చూసేస్తారేమోనని చివరికి డిలీట్ చేసేశానని జక్కన్న నవ్వుతూ చెప్పారు. మహేష్‌లో కనిపించిన ఆ రామత్వం, ఆ ప్రశాంతత, ఆ తేజస్సు…తాను ఊహించిందే కాదు, ఊహకు మించినది అని ఆయన స్పష్టం చేశారు.
'ఆదిపురుష్'లో ప్రభాస్ రాముడిగా కనిపించాడు. కానీ సినిమా ట్రీట్‌మెంట్‌తో పాటు ‘డార్లింగ్’ లుక్స్‌పైన కూడా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనే వచ్చింది. ఓం రౌత్ ఆ అవకాశాన్ని సరిగా వినియోగించుకుని ఉంటే, ఆ నెగిటివ్ కామెంట్స్ ఏవీ వచ్చేవి కాదు. కానీ ఆ అవకాశం జారిపోయింది. ఇప్పుడు అయితే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మహేష్ బాబును హ్యాండిల్ చేస్తున్నది జక్కన్న—ఎస్.ఎస్. రాజమౌళి. అంచనాలు ఎంత పెంచుకున్నా, దానికంటే ఎక్కువ ఇచ్చే దర్శకుడు రాజమౌళి. ఆయన సినిమాల్లో హీరోల పట్టుదల, భావావేశం, దివ్యత, శక్తి—ఇవన్నీ ఒక కొత్త స్థాయికి వెళ్తాయి. అలాంటప్పుడు రాముడి పాత్రలో మహేష్ బాబు స్క్రీన్‌పై కనిపించే తీరు ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి