తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన హీరో పేరు ప్రదీప్ రంగనాథన్. జయం రవితో తెరకెక్కించిన కోమలి సినిమాతో దర్శకుడిగా పరిచయమై, తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే అతనికి అసలైన స్టార్‌డమ్ తెచ్చిపెట్టిన ప్రాజెక్ట్ లవ్ టుడే. ఈ చిత్రంతో నటుడిగా, దర్శకుడిగా ఒకేసారి విజయం సాధించి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత ప్రదీప్ రంగనాథన్ పేరు తమిళనాడుతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా మారుమ్రోగింది.


లవ్ టుడే సక్సెస్‌ తర్వాత అతని కెరీర్ గ్రాఫ్ ఊపందుకుని రాకెట్‌లా దూసుకెళ్లింది. అదే ఫామ్ కొనసాగిస్తూ ఈ ఏడాదిలో విడుదలైన డ్రాగన్, డ్యూడ్ సినిమాలతో వరుసగా వంద కోట్ల క్లబ్‌లో చేరి, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. వరుసగా ఇలాంటి భారీ విజయాలు అందుకోవడం యువ హీరోల్లో చాలా అరుదైన విషయమే.ఇప్పుడు మరో సారి తనదైన సెన్సేషన్ సృష్టించేందుకు ప్రదీప్ రెడీ అవుతున్నాడు. నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ రూపొందించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం షూటింగ్ దశ నుంచే మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్, సాంగ్స్, ట్రైలర్—అన్ని కలిసి సినిమాపై మంచి పాజిటివ్ బజ్‌ను నిలబెట్టాయి.



ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఈ సినిమా కూడా హిట్ టాక్ సాధిస్తే వంద కోట్ల మార్క్‌ను దాటటం చాలా ఈజీగా కనిపిస్తోంది. అలా జరిగితే, ఒకే ఏడాదిలో మూడు చిత్రాలు వంద కోట్ల క్లబ్‌లో చేరిన హీరోగా ప్రదీప్ రంగనాథన్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పనున్నాడు. ఇటీవల కాలంలో ఇది అతని రేంజ్, క్రేజ్, మార్కెట్ ఎంత పెరిగిందో చూపించే సూచికగా భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పుడు చూడాల్సిందల్లా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో. డిసెంబర్ 18న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ప్రదీప్ రికార్డు పూర్తి అవుతుందా? లేక మరొక సర్‌ప్రైజ్ విజయం అందుకుంటాడా? అన్నది సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో కూడా భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: