ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘ డ్రాగన్ ’ పై అంచనాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ యాక్షన్ థ్రిల్లర్లతో దేశవ్యాప్తంగా పేరుగాంచిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడం, మరోవైపు ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సంపాదించుకున్న క్రేజ్ కలవడంతో ఈ ప్రాజెక్ట్‌పై విశేష హైప్ నెలకొంది. ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న అప్డేట్ ఈ అంచనాలను మరింత పెంచింది. మలయాళ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదుగుతున్న టోవినో థామస్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. గోవాలో జరిగిన IFFI ఈవెంట్లో టోవినో థామస్‌ను ‘ డ్రాగన్ ’ సినిమాలో ఆయన పాత్ర గురించి ప్రశ్నించగా, “ఇప్పుడే దీనిపై మాట్లాడే స్థితిలో లేను” అని చెప్పారు. ‘మిన్నల్ మురళి’, ‘2018’, ‘A.R.M’ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించిన టోవినో, ఎక్కువగా ఎమోషనల్ డెప్త్ ఉన్న పాత్రలను ఎంచుకోవడంలో ముందుంటాడు.
ఈ క్రమంలోనే ‘డ్రాగన్’లో ఆయన పాత్ర ఏ దిశలో ఉండబోతుందో అన్న ఆసక్తి సహజంగానే ఉంది. అంతే కాదు, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో భాగమవుతారన్న వార్తలు మీడియాలో గట్టిగా వినిపిస్తున్నా, దీనిపై సినిమా యూనిట్ ఇంకా అధికారికంగా రియాక్ట్ కాలేదు. ఒకవైపు సౌత్ - నార్త్ - మలయాళ మల్టిస్టారర్ రేంజ్ కాస్టింగ్ జరిగేలా ఉన్న సంకేతాలు రావడంతో, ఈ సినిమా స్కేల్ ఎంత దగ్గరికి వెళ్లబోతోందన్న విషయం ఇప్పటికే అర్థమవుతోంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్సులు, విజువల్ ట్రీట్, రా ఇంటెన్సిటీతో తెరకెక్కనుందని టాక్. ఇప్పటికే తొలి షెడ్యూల్లో భాగంగా కీలక యాక్షన్ సన్నివేశాలు పూర్తయ్యాయని సమాచారం.
టైటిల్ టీజర్ లేకపోయినా, కాస్టింగ్ అప్డేట్లు, స్టార్ కాంబినేషన్, ప్రశాంత్ నీల్ నయా మాస్ స్టార్మ్ అనే మాటలతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ‘డ్రాగన్’ నుంచి అధికారిక ప్రకటనలు వచ్చే ప్రతిసారీ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇది మాస్ జాతరగా అభివర్ణించుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి