ఇటీవల టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య ప్రకటించబడిన సినిమాల్లో విక్టరీ వెంకటేష్త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ ఒకటి. తొలిసారిగా ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తుండటంతోనే ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి భారీగా పెరిగింది. త్రివిక్రమ్ అంటే కుటుంబ భావోద్వేగాలు, చురుకైన సంభాషణలు, సమకాలీన ఆలోచనలు… ఈసారి వాటికి తోడు క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి ఆయన కథను రూపొందిస్తున్నారన్న వార్త సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

అందుతున్న సమాచారం ప్రకారం, ‘ఆదర్శ కుటుంబం’ ఒక సాధారణ కుటుంబ కథలా కనిపించినప్పటికీ, లోతైన మలుపులు, సస్పెన్స్‌తో కూడిన కథనంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచేలా రూపొందుతోంది. విక్టరీ వెంకటేష్‌కు బాగా సూటయ్యే ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో, కొత్త తరహా కథనాన్ని త్రివిక్రమ్ తెరపై చూపించబోతున్నారట. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళిక వేస్తున్నారు.అయితే షూటింగ్ ప్రారంభమైన నాటి నుంచి ఈ ప్రాజెక్ట్‌లో కొన్ని కీలకమైన సాంకేతిక మార్పులు చోటు చేసుకున్నాయి. మొదటగా, ‘లక్కీ భాస్కర్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్ నేతృత్వంలో ఒక కీలక ఇంటి సెట్‌ను నిర్మించారు. కానీ ఆ సెట్ త్రివిక్రమ్ ఆశించిన స్థాయిలో లేదని ఆయన భావించడంతో, ఆ సెట్‌ను పూర్తిగా మార్చే నిర్ణయం తీసుకున్నారట. అనంతరం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్‌ను రంగంలోకి దించి, కొత్తగా డిజైన్ చేసిన సెట్‌తో షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించారు.

ఇదే కాకుండా, సినిమాటోగ్రఫీ విభాగంలోనూ మార్పులు జరిగినట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. కథకు, విజువల్ టోన్‌కు పూర్తిగా సరిపడే అవుట్‌పుట్ రావాలన్న ఉద్దేశంతో త్రివిక్రమ్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం. ఈ మార్పుల వల్ల షూటింగ్ షెడ్యూల్స్ కొంతవరకు ఆలస్యం అవుతున్నప్పటికీ, సినిమాకి కావాల్సిన నాణ్యత విషయంలో మాత్రం ఆయన ఎలాంటి రాజీ పడటం లేదని టీమ్ దగ్గర నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమా అంటే మాటల మాంత్రికత్వంతో పాటు టెక్నికల్ పరంగా కూడా అత్యున్నత ప్రమాణాలు ఉంటాయన్న అంచనాలు ప్రేక్షకుల్లో సహజంగానే ఉంటాయి. అదే స్థాయిలో ఈ సినిమాను కూడా తెరకెక్కించాలన్న పట్టుదలతోనే ఆయన ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. షెడ్యూల్ ఎంత కష్టమైనా సరే, అనుకున్న విజన్‌ను తెరపై ఆవిష్కరించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది.

మొత్తానికి, కొద్దిపాటి ఆలస్యం జరిగినా సరే, ‘ఆదర్శ కుటుంబం’ను అనుకున్న సమయానికే పూర్తి చేసి, వేసవి ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందించాలన్నదే చిత్ర బృందం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా టాలీవుడ్‌లో కొత్త బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: