సోషల్ మీడియాలో ఇటీవల మళ్లీ “అల్లు వర్సెస్ మెగా” అనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నాళ్లుగానో అభిమానులు తమ అభిమాన హీరోల కోసం పరస్పరం మాటల యుద్ధం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ హద్దులు దాటి, హీరోల కుటుంబాలు, అంతేకాదు చిన్న పిల్లల వరకు ఈ గొడవలు వెళ్లడం చాలా ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబంలో ఆనందకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆయన భార్య ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో, మెగా ఫ్యామిలీతో పాటు వారి అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఒక వైపు మెగా కుటుంబానికి వారసులు వచ్చారనే భావనతో అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా, మరో వైపు కొందరు సోషల్ మీడియాలో బాధ్యతలేని, అర్థంలేని వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు.

ప్రత్యేకంగా కొన్ని సోషల్ మీడియా వేదికలపై ఉపాసనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ, ఆమె కావాలనే ట్రీట్‌మెంట్స్ తీసుకుందని, హాస్పిటల్స్ ప్రభావం ఉందని అంటూ చాలా దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇవి కేవలం ఒక సెలబ్రిటీ కుటుంబాన్ని మాత్రమే కాదు, సాధారణంగా మహిళలను, మాతృత్వాన్ని అవమానించే స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. దీనిపై మెగా అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ, అలాంటి నెగిటివ్ కామెంట్స్‌కు గట్టిగా కౌంటర్స్ ఇస్తున్నారు.ఇంతటితో ఆగకుండా, మరికొందరు అభిమానులు విషయం పూర్తిగా తప్పుదారి పట్టిస్తూ, “మెగా వారసుడు” అంటూ రామ్ చరణ్ పిల్లలను గొప్పగా చెప్పడమే కాకుండా, పరోక్షంగా అల్లు అర్జున్ కొడుకును టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ గతంలో కూడా సోషల్ మీడియాలో అనవసర ట్రోలింగ్‌కు గురయ్యాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో, ఒక చిన్న పిల్లవాడిని పోలికల్లోకి లాగడం, అతని క్రేజ్ గురించి మాట్లాడడం, ఒకరిని పైకి లేపేందుకు ఇంకొకరిని తగ్గించే ప్రయత్నం చేయడం చాలా దిగజారిన ప్రవర్తనగా మారింది.

ఇలా చూస్తే, హీరోల మధ్య ఉన్నట్లు చూపించే పోటీ ఇప్పుడు వారి పిల్లల వరకు వెళ్లిందన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఈ చిన్నారులకు సినిమా, ఫ్యాన్ వార్స్, స్టార్ డమ్‌లతో ఏమాత్రం సంబంధం లేదు. వాళ్లు కేవలం తమ కుటుంబాల ఆనందం కోసం పుట్టిన పిల్లలు. కానీ అభిమానుల అతిశయోక్తి ప్రేమ, అతి అభిమానంగా మారి, పిల్లలను కూడా ట్రోలింగ్‌కు గురిచేయడం చాలా బాధాకరం.ఈ మొత్తం వ్యవహారంపై సోషల్ మీడియాలో చాలా మంది సాధారణ ప్రజలు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. “మీ హీరోల గొడవలు మీ వరకు పెట్టుకోండి, పిల్లల్ని ఈ విషయంలోకి లాగడం ఎంతవరకు సరైనది?” .. “ఫ్యాన్ వార్స్ పేరుతో మానవత్వం మరిచిపోతున్నారా?” అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇది చాలా సమంజసమైన స్పందన. ఎందుకంటే అభిమానమంటే ప్రేమ, గౌరవం ఉండాలి కానీ ద్వేషం, అవమానం కాదు.

మెగా ఫ్యామిలీ అయినా, అల్లు ఫ్యామిలీ అయినా—ఇవి రెండూ తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన కుటుంబాలే. వాళ్ల కుటుంబాల్లో పుట్టిన పిల్లలు భవిష్యత్తులో ఏ దారి ఎంచుకుంటారో కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు ఇప్పుడే వారిపై అంచనాలు పెట్టడం, పోలికలు చేయడం, ట్రోల్స్ చేయడం పూర్తిగా అనవసరం.

చివరగా చెప్పాల్సింది ఒక్కటే..ఫ్యాన్‌గా ఉండటం తప్పు కాదు, కానీ ఆ అభిమానంతో ఇంకొకరిని కించపరచడం, ముఖ్యంగా చిన్న పిల్లలను టార్గెట్ చేయడం మాత్రం క్షమించరాని విషయం. సోషల్ మీడియాలో మాటలకు విలువ ఉంది, బాధ్యత ఉంది. హీరోలు ఎప్పుడూ తమ కుటుంబాల గురించి గౌరవంగా మాట్లాడతారు, కానీ అదే గౌరవాన్ని అభిమానులు కూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకైనా సరే, “అల్లు వర్సెస్ మెగా” అనే ట్యాగ్‌లకు ఫుల్ స్టాప్ పెట్టి, పిల్లలను పిల్లలుగానే చూడడం నేర్చుకుంటే అదే నిజమైన అభిమానానికి అర్థం.

మరింత సమాచారం తెలుసుకోండి: