ఈ బిల్లు అమల్లోకి వస్తే అమెరికాలో నివాసం ఉంటున్న విదేశీయులు తాము సంపాదించిన డబ్బును వేరే దేశాల్లో ఉన్న తమ వారికి పంపితే భారీగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కాస్త ఊరట కలిగించే విషయం ఏంటంటే.. డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు శుక్రవారం హౌస్ బడ్జెట్ కమిటీలో ఆమోదం పొందడంలో విఫలమైంది. నాటకీయ పరిణామాల మధ్య, ఐదుగురు రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్యానెల్ 21-16 ఓట్ల తేడాతో బిల్లును తిరస్కరించింది. దాంతో సవరణలు చేసి బిల్లును వచ్చే వారం ఫ్లోర్ ఓటింగ్‌కు తీసుకురావాలని హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ తెలిపారు.
ఒకవేళ ఈ బిల్లు అమల్లోకి వచ్చిందంటే అమెకారిలోని విదేశీయులకు పెద్ద షాకే అవుతుంది. ముఖ్యంగా భారతీయులు భారీగా నష్టపోనున్నారు. ఉదాహరణకు అక్కడి భారతీయులు స్వదేశంలో ఉన్నవారికి ఒక రూ.లక్ష బదిలీ చేయాలి అనుకుంటే 5 శాతం పన్ను నిబంధన కింద రూ.5,000 చెల్లించుకోవాల్సి ఉంటుంది. వెస్ట్రన్ యూనియన్, మనీగ్రామ్ లేదా అమెరికా ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకులు ఈ పన్నులు వసూల్ చేస్తాయి. కాగా, 2023-24లో ఇండియాకు అమెరికా నుంచి 32 బిలియన్ డాలర్ల మేర నగదు బదిలీలు జరిగాయి. నూతన పన్ను విధానం అమలులోకి వచ్చాక ఎప్పటిలాగానే ఈ నగదు బదిలీలు జరిగితే అమెరికాలోని భారతీయులు 1.6 బిలియన్ డాలర్లు పన్ను రూపంలో నష్టపోతారని అంటున్నారు.