విశాఖపట్నంలోని రుషికొండ భవనాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వంలో నిర్మించిన ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో తేల్చేందుకు నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై ప్రధానంగా చర్చించింది. ఈ భవనాలను ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి భారీ ఆదాయం తెచ్చేలా త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రులు పయ్యావుల కేశవ్‌, డోలా బాలవీరాంజనేయస్వామి, కందుల దుర్గేశ్‌ తెలిపారు. మెగా సంస్థల నుంచి 'విలాసవంతమైన' ప్రతిపాదనలు! రుషికొండ భవనాలను ఎలా ఉపయోగించాలో ప్రజలు, స్టేక్ హోల్డర్స్‌ అభిప్రాయాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించింది.


 ఈ భవనాలను అద్భుతమైన ఆతిథ్య కేంద్రాలుగా, పర్యాటక ప్రాంతంగా, విలాసవంతమైన బీచ్ విల్లాలుగా, చక్కని మ్యూజియంతో తీర్చిదిద్దేందుకు దేశ, విదేశాలకు చెందిన పలు ప్రముఖ హోటల్, హాస్పిటాలిటీ సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాయి. ముఖ్య ప్రతిపాదనలు: టాటా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఐహెచ్‌సీఎల్‌ గ్రూపు, ఎట్మాస్పియర్‌ కోర్ హాస్పిటాలిటీ గ్రూపు, ద లీలా (ప్యాలెస్‌లు, హోటళ్లు, రిసార్టుల గ్రూపు), హెచ్‌ఈఐ (హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ గ్రూపు) వంటి సంస్థలు తమ ప్రతిపాదనలను సమర్పించాయి. ఫలక్‌నుమా ప్యాలెస్ ఫార్ములా: హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌ను సహజత్వం కోల్పోకుండా ఏ విధంగా వినియోగిస్తున్నారన్న అంశంపైనా ఈ సందర్భంగా చర్చించారు. ఆ తరహాలో రుషికొండను కూడా మార్చే అవకాశాలపై దృష్టి సారించారు.

 

నెలకు రూ. 30 లక్షల 'మెయింటెనెన్స్' ఖర్చు! రుషికొండ భవనాలను తక్షణమే వినియోగంలోకి తీసుకురావడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి... వాటి భారీ నిర్వహణ ఖర్చు. ఈ భవనాల నిర్వహణకు ప్రతి నెలా సుమారు 25 నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చవుతోందని కేబినెట్ సబ్ కమిటీ వెల్లడించింది. ఇంత భారీ వ్యయాన్ని భరించకుండా, ఆ భవనాలనుంచి ఆదాయం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 1,517 ప్రతిపాదనలు ప్రజల నుంచి అందగా, అందులో కేవలం 250 మాత్రమే భవనాలను ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై స్పష్టమైన, ఆచరణీయమైన సూచనలు చేశాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత, భవనాల వినియోగానికి సంబంధించి రెండు లేదా మూడు ప్రతిపాదనలను కేబినెట్ ముందు ఉంచుతామని మంత్రులు తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకుని, రుషికొండ భవనాలను త్వరలో విశాఖపట్నం పర్యాటకానికి 'మాస్ అట్రాక్షన్'గా మార్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: