సినిమా నుంచి సామాజిక సందేశాలు కన్నా విప్లవాత్మక మార్పు కోరుకోవడం తప్పేం కాదు. కానీ మనం నిర్మించుకున్న వ్యవ స్థల్లో మనం పాటిస్తున్న నియమాల్లో, మనం పాటించని నిబద్ధతలో కొంతలో కొంత రాజకీయ జోక్యం ఉంది. రాజకీయ ప్రభావం ఉంది. అత్యాచారాలను ఆపలేని వ్యవస్థలో, ఎన్కౌంటర్ ఒక్కటే పరిష్కారం అని చెప్పే అంతిమ తీర్పులో మనుషుల దిగజారుడు తనం ఉంది. మోసం ఎలా ఉన్నా భరించే స్థితిలో మనుషులు ఉన్నారు. నాయకులు ఎలా ఉన్నా, ఆ తయారీని, ప్రవర్తనను నిలదీయ లేని స్థితిలో ఉన్నారు. ఈ సారి దేవా కట్టా ప్రస్థానంకు మించిన ప్రయత్నమేదో చేశాడు. రిపబ్లిక్ పేరుతో సినిమాటిక్ లిబర్టీని దాటేశాడు. కావాల్సినంత స్వేచ్ఛ రాసేటప్పుడు, పరిధిని చెరిపి రాసేటప్పుడు మనుషుల వికృతాలకు  కాస్తయినా సినిమా చోటు ఇచ్చినప్పుడు వ్యవస్థలో కోరుకునే మార్పు వచ్చేంత వరకూ  కొన్ని ఆలోచనలు రిపబ్లిక్ లాంటి సినిమాలకు ఊపిరి ఇస్తాయి. ఇస్తూనే ఉంటాయి.



అజ్ఞానం మనుషుల్లో ఎలా ఉంది.. నమ్మకం, విశ్వాసం అన్నవి ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి. మనుషులపై ప్రభావితం చేయని నిజాయితీ, సామాజిక కట్టుబాటు  ఇవన్నీ ఓ వ్యవస్థ పతనానికి ఎలా కారణం అవుతున్నాయి. చేపల చెరువుల కారణంగా తన ఉనికినే కోల్పోతున్న కొల్లేరు సరస్సు  పచ్చని పొలాలకు రాస్తున్న మరణ శాసనం ఏంటి? ఇవన్నీ  రిపబ్లిక్ సినిమా మాట్లాడాల్సినంత మాట్లాడింది. విశాఖ వాణి పాత్ర ద్వారా రమ్యకృష్ణ చెప్పించిన ప్రతి మాట మన పరిణామాలను వివరించేదే..మన పరిమాణాలను మన కొలమానాలనూ నిర్దేశించేదే. సినిమా వీటన్నింటిపై వీలున్నంత మేర తన పరిధిలో వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న నాయక గణం గురించి చెప్పింది. చెబుతూనే ఉంది.



ప్రజలెలా ఉన్నారు అన్నది వ్యవస్థ చెబుతుంది. వ్యవస్థ ఎలా దుర్భరంగా ఉందో సినిమా చెబుతుంది. సినిమా తప్పులను మీడియా చెబుతుంది. గుర్తిస్తుంది. రిపబ్లిక్ సినిమా ప్రజలెలా ఉన్నారో చెప్పింది. ప్రతి చోటా పనిచేసే ప్రాథమిక స్వార్థం ఎలా ఉందో కూడా చెప్పింది. సినిమాకు ప్రాణంగా నిలిచిన కొన్ని సన్నివేశాల్లో పర్యావరణ పరిరక్షణ, నాయక స్వామ్య లక్షణం, నేలకు కాపాడుకోవాలన్న తపన, ఓ కలెక్టర్ అందుకు చేసిన కృషి, లేదా అందుకు దారి ఇచ్చిన పరిణామాలు ఇవన్నీ చర్చకు  సరిపడినంత విషయాలు. మన దేశంలోనూ మన దేహంలోనూ ఎప్పుడూ ఎవరో ఒకరు చేసే స్వారీ కారణంగానే జీవితాలను బానిసలుగా మలుచుకునే క్రమం ఒకటి ఉండిపోతోంది. ఈ సినిమా బానిస మనస్తత్వాల గురించి చెప్పింది. యజమాని గుణాలను చెప్పింది. కొన్నేళ్లుగా కొల్లేరు ప్రాంతంలో చోటుచేసుకుంటున్న అక్రమాల గురించి మాట్లాడి, ఇంకాస్త ఆలోచించమని చెప్పింది. కులం, రాజకీయం ఈ రెండూ వ్యవస్థలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో చెప్పింది. లెజిస్లేటివ్ స్ట్రక్చర్ , బ్యూరో క్రాట్ ను ఏ విధంగా అదుపు చేస్తుందో కూడా చెప్పింది. దేవా కట్టా కొన్ని తప్పులు చేశాడు అయినా  కూడా ఈ సినిమా బాగుంది.




పచ్చని పొలాలకు మరణ శాసనం రాసే సంస్థల గురించి  ఎవ్వరూ మాట్లాడరు. అవి అభివృద్ధిని మోసుకువచ్చి, మోసకారి జీవితాలను ప్రసాదించి వెళ్తుంది. కొల్లేరు సమస్య ఎప్పటి నుంచో ఉంది. కాలుష్య కారకాల నివారణ కానీ అక్రమ చేపల చెరువుల నిర్వహణ కానీ ఎవ్వరికీ పట్టదు. సినిమా ఈ భావోద్వేగాన్ని సమస్యను నెత్తిన పెట్టుకుంది. రిపబ్లిక్ సినిమా చేయాల్సినదంతా చేసింది. జలవనరుల రక్షణ అన్నది నాయకుల చేతుల్లో పని, ప్రజల చేతుల్లో పని.. ఇవన్నీ వదిలి మాట్లాడడం తగని పని.


వ్యవస్థలను బాగు చేసే పని, వ్యవస్థలను సంస్కరించేందుకు కావాల్సిన పని, వ్యవస్థల్లో కావాల్సిన మార్పును కోరుకునే పని మిక్కిలి ప్రేమతో చేయండి. చేయాలి. ఎవరు చేయాలి. సినిమా చేయాలి. సినిమా నుంచి ప్రతిపాదనలు కొన్ని పొంది వ్యవస్థ తనని తాను దిద్దుకోవాలి. పవర్ ఫుల్ మీడియా చేయాల్సిన పనుల్లో ముఖ్యమయిన పని ఇదొక్కటి. రిపబ్లిక్  సినిమా ఆ పని హాయిగా చేసింది. కొన్ని తప్పిదాల మినహా సినిమా చాలా బాగుంది. జీవన్మరణ సమస్యలను ప్రస్తావించిన తీరు చాలా బాగుంది. దేవా కట్టా డైలాగ్ చాలా బాగుంది. సాయి ధరమ్ తేజ్ మిగతా సినిమాల కన్నా ఈ సినిమాలో బాగున్నాడు. నటన పరంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. అవుతాడు కూడా!


మరింత సమాచారం తెలుసుకోండి: