పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలంటే ముందు మాకు వ్యాక్సినేషన్ పూర్తి చేయండి, ఆ తర్వాత ఎన్నికలు పెట్టుకోండి అంటూ ఆమధ్య కోర్టుల వరకూ వెళ్లారు ఏపీ రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు. తీరా వ్యాక్సినేషన్ వేయించుకోండి అంటూ రెండో విడత మొదలు పెట్టే సరికి మాత్రం సగానికి సగం మంది పారిపోతున్నారు. తొలి విడద వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ వేయించిన కేంద్రం, రెండో విడత ఫ్రంట్ లైన్ వారియర్స్ లో భాగంగా రెవెన్యూ సిబ్బందికి టీకాలు ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఆమేరకు రాష్ట్రవ్యాప్తంగా టీకాల పంపిణీ మొదలు కాగా.. రెవెన్యూ ఉద్యోగుల్లో సగానికి సగం మంది భయపడుతున్నట్టు తెలుస్తోంది. టీకా పంపిణీ మొదలై రెండు రోజులు గడిచినా కూడా కనీసం 15శాతం సిబ్బంది కూడా టీకా వేయించుకోడానికి ముందుకు రాలేదట.