ముందు ఉపఎన్నికలు,ఆతర్వాత రాష్ట్రపతి ఎన్నికలను సాకుగా చూపి తెలంగాణపై నిర్ణయాన్ని సాగదీసిన కాంగ్రేస్ ఇక నిర్ణయం తీసుకునే పరిస్థితులు వచ్చాయి. ఒకటిరెండు రోజులుగా కాంగ్రేస్ నేతల మాటలు కూడా ఈవిషయాన్ని నిర్దారిస్తున్నాయి. దీంతో ఢిల్లీలో కేంద్రీకృతమై ఉన్న టి గుండం దక్షిణ దిశగా పయనించి రాష్ట్రాన్ని చేరుకుని తుఫానుగా మారింది. టి..టిడిపి, టి..కాంగ్రేస్, టి ఆర్ఎస్,లకు తోడు ఈపార్టీలన్నింటిని ఇరుకున పెట్టే పని పెట్టుకున్న టిజెఏసి ఇలా టి తగిలించుకుని తీరికలేకుండా కాలం గడుపుతున్నవారికి టెన్షన్ మొదలైంది. లేటెస్టుగా పిసిసి అధ్యక్షులు బొత్ససత్యనారాయణ తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి అని పేర్కొనడంతో ఈతుఫాను మరింత బలపడింది. ఇన్నాళ్లు మాటల తూటాలతో పబ్బం గడిపిన వీరికి ఇక ఎలా ముందుకు పోవాలన్నది సమస్యగా మారింది. ఒకవేల కాంగ్రేస్ తెలంగాణకు సై అంటే అది ఆపార్టీకి ప్లస్ అయితే తెలంగాణ అంశాన్నే ప్రాణవాయువుగా చేసుకుని పదేళ్లుగా పబ్బం గడుపుతున్న టిఆర్ఎస్ పరిస్థితి ఏంటి అన్న బెంగ గులాబి దండులో దడ పుట్టిస్తోంది. రెండు కళ్లపేరుతో నాఘర్ కా నా ఘాట్ కా అన్నట్లున్న టిడిపి పరిస్థితి ఏమిటి..? సై అంటే ఓబాధ నో అంటే పార్టీ రెండు ముక్కలు అయ్యే ప్రమాదముంది. మరో వైపు ఈరెండు కళ్ల బాధలేమి లేని వైకాపా అటు సీమాంధ్రలో ప్రభంజనాన్ని చాటి తెలంగాణలోకి అడుగుపెడుతోంది. ఇది టిడిపి,కాంగ్రేస్ ల కంటే టిఆర్ఎస్ నే ఎక్కువ కలవరపాటుకు గురిచేస్తోంది. సై అన్నా నో అన్నా కాంగ్రేస్ కు లాభనష్టాలు రెండూ ఉన్నాయి. సై అంటే ముందు నుంచి వ్యతిరేకిస్తున్న లగడపాటి, రాయపాటి లాంటి వారి నుంచి కొంత ఇబ్బందులెదురు కావచ్చు.ఏది ఎక్కువ అన్నదే ఆపార్టి ఆలోచన. ఇక నో అంటే మాత్రం షరా మామూలే. టిఆర్ఎస్ ఆందోలనలతో ఎప్పటిలాగే కాలం వెల్లదీస్తుంది. టిడిపి ది అదేబాట టిటిడిపి పేరుతో అది నెట్టుకు పోతుంది.కాంగ్రేస్ లో అయితే ఒక టీఎంపీలు చేసే కిరికిరి తప్ప టిఎమ్మేల్యేల నుంచి ఇప్పటి వరకు పెద్ద ఇబ్బందులెదురు కాలేదు. ముఖ్యమంత్రి పదవిని ముచ్చటగా ఇస్తే తెగ ముచ్చటపడిపోతారన్న నమ్మకం అధిష్టానంలోను ఉంది. సందెట్లో సడేమియాలాగా తెలంగాణలో వైకాపా పుంజుకోవడం మొదలెడితే చిక్కుల్లో పడేది టిఆర్ఎస్ మాత్రమే. ఎందుకంటే టిడిపికి సీమాంధ్ర మిగిలి ఉన్నా టిఆర్ఎస్ ఆ అవకాశంలేదు. అందుకే విజయమ్మను ఆదిలోనే అడ్డుకోవాలని తెగ తిప్పలు పడుతోంది. ఇక కాంగ్రేస్ కు అంత బెంగలేదు, ఎందుకంటే జగన్ వారివైపే చూస్తున్నారు కాబట్టి. ఏది ఏమైనా సోనియా నిర్ణయం పైనే టి కప్పులోని తుఫాను తీవ్రత ఎంత అన్నది తేలనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: