హైదరాబాద్: సోమవారం నాడు జగన్ను సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు. అక్రమ ఆస్తుల కేసులో గత నెల 27న సీబీఐ అధికారులు విచారణకు పిలిచి అరెస్టు చేసిన విషయమే. 27న అరెస్టు చూపించిన సీబీఐ అధికారులు 28న నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరు పర్చగా జగన్ కు అక్కడి న్యాయస్థానం 14రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండు విధించింది. న్యాయస్థానం విధించిన జ్యూడీషియల్ రిమాండు ముగియడంతో ఆయనను తిరిగి న్యాయస్థానం ముందు హాజరుపర్చనున్నది. అక్రమ ఆస్తుల విషయంలో జగన్ నుంచి మరిన్ని విషయాలు రాబట్టడానికి తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ అధికారులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఐదు రోజుల కస్టడీకి ఇచ్చింది. ఐదు రోజుల కస్టడీ ముగిసిన తరువాత సీబీఐ మరో పిటీషన్ వేసింది. ఐదు రోజుల కస్టడీలో జగన్ విచారణకు తమకు ఏ మాత్రం సహకరించలేదనీ, మరి కొన్ని రోజులు విచారించాల్సిందిగా సీబీఐ వేసిన పిటీషన్కు కోర్టు మరో రెండ్రోజుల కస్టడీకి ఇచ్చింది. దీనితో ఈ నెల 9,10తేదీల్లో రెండ్రోజుల పాటు రెండో దఫా విచారించింది. కోర్టు విధించిన 14రోజుల జ్యూడీషియల్ రిమాండు లో 7రోజుల పాటు సీబీఐ కస్టడీలో సాగింది. అయితే, జగన్కు విధించిన జ్యూడీషియల్ రిమాండు సోమవారంతో ముగియడంతో తిరిగి ఆయనను న్యాయస్థానం ముందు హాజరపర్చడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఉప ఎన్నికల పోలింగ్కు కేవలం కొన్ని గంటల వ్యవధి మిగిలి వుంది. ఈ క్రమంలో జగన్ను కోర్టుకు సీబీఐ హాజరుపర్చనున్నది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టుకు ఎలాంటి నివేదికను సమర్పించనున్నదో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: