ఆర్థిక మాంద్యం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంతో పాటు ఇండియా పైనా దీని ప్రభావం పెరుగుతోంది. ప్రత్యేకించి దేశ వాహన రంగంలో మాంద్యం ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. దేశీయ మార్కెట్ లో ప్రయాణుకుల వాహన విక్రయాలు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి.


తాజా గణాంకాలు చూస్తుంటే.. మాంద్యం ఏ రేంజ్ లో ఉందో ఇట్టే తెలిసిపోతోంది. దేశంలో వాహన విక్రయాలు వరుసగా పదోనెల క్షీణించాయి. 2018 ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రయాణ వాహన విక్రయాలు 31.57శాతం క్షీణించాయి. అంటే వాహనాలు కొనేవారి సంఖ్య బాగా తగ్గిపోయిందన్నమాట.


గతేడాది ఆగస్టు నెలలో 2లక్షల 87వేల 198 వాహనాలు అమ్ముడయ్యాయి. ఈసారి ఆ సంఖ్య లక్షా 96వేల 524కే పరిమితమైంది. ఇందులో కార్ల విక్రయాలు అత్యధికంగా తగ్గిపోయాయి. ఏకంగా 41శాతం క్షీణించాయి. అంటే దాదాపు సగానికి సగం పడిపోయాయన్నమాట. 2018 ఆగస్టులో లక్షా 96వేల 847కార్లు అమ్ముడయ్యాయి. ఈసారి లక్షా 15వేల 957 మాత్రమే అమ్ముడయ్యాయి.


ఇక మోటారు సైకిళ్ల విక్రయాలు 12లక్షల 7వేల 5 నుంచి 22.33శాతం క్షీణించాయి. 9లక్షల 37వేల 486కే పరిమితమ్యాయి. మొత్తం బైకుల అమ్మకాలు..19లక్షల 47వేల 304 నుంచి.....15లక్షల 14వేల 196కు పడిపోయాయి. ఈ రంగంలో అమ్మకాలు 22.24శాతం తగ్గాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు.. 38.71 శాతం తగ్గాయి. 51వేల 897లకే పరిమితమయ్యాయి.


ఓవర్ ఆల్ గా... వాహన అమ్మకాలు 23.55శాతం క్షీణించాయి. ఈ లెక్కలు ఇప్పుడు మార్కెట్ ను వణికిస్తున్నాయి. ఈ పతనం ఇంకెక్కడి దాకో అని వాహన రంగంపై ఆధారపడినవారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పడే పరిస్థితి ఇలా ఉంటే.. ముందు ముందు ఇంకెలా ఉంటుందో అన్న ఆందోళన ఆయా వర్గాల్లో కనిపిస్తోంది. చూడాలి ఇంకేం జరుగుతుందో..


మరింత సమాచారం తెలుసుకోండి: