ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ కొరకు గతంలో ఉన్న అర్హతల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఆహార భద్రత నియమాల్లో సవరణలు చేసింది. వార్షికాదాయంతో పాటు ఇతర నియమ నిబంధనల్లో మార్పులు చేసింది. గ్రామాల్లో వార్షికాదాయం లక్షా 20 వేల రూపాయలు, పట్టణాల్లో వార్షికాదాయం లక్షా 44 వేల రూపాయలు ఉన్న కుటుంబాలు మాత్రమే రేషన్ కార్డుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. 
 
మారిన నిబంధనల ప్రకారం ఫోర్ వీలర్స్ వాహనాలు ఉన్నవారు రేషన్ కార్డుకు అనర్హులు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులను మాత్రం బీపీల్ కోటా కింద పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం ఆహార భద్రత కార్యక్రమంలో భాగంగా నాణ్యమైన బియాన్ని ప్రజలకు అందించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాను ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని అందించేలా పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంది. 
 
రేషన్ కార్డు ఉన్నవారికి స్వర్ణ బియ్యానికి సమానమైన నాణ్యమైన బియ్యాన్ని అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం బియ్యాన్ని ఇంటికే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం కోటీ 40 లక్షల రేషన్ కార్డులు ఉండగా 92 లక్షల మంది కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరిస్తోంది. మిగిలిన వారికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భరిస్తోంది. 
 
ప్రభుత్వం 2020 సంవత్సరం ఏప్రిల్ నెల నుండి 13 జిల్లాల్లో నాణ్యమైన బియ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం పర్యావరణహితమైన బ్యాగుల్లో ప్రజలకు బియ్యం ఇవ్వనుంది. మంత్రి కొడాలి నాని ప్రస్తుతం ఉన్న డీలర్లను ఎవరినీ తీయబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. 11వేల కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని రూపాయికే కిలో చొప్పున పంపిణీ చేస్తున్నట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: