దిశ కేసులో నిందితులకు ఎన్ కౌంటర్ ద్వారా న్యాయం జరిగిందని దేశమంతా భావిస్తోంది. నిన్నంతా సంబరాలు జరుపుకున్నారు. సజ్జనార్ టీమ్ పై ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఎన్ కౌంటర్ విషయంలో ఒక మహిళ ఆవేదన అందర్నీ కదిలిస్తోంది. ఆలోచింపజేస్తోంది. ఆమె రేపిస్టు చెన్నకేశవులు భార్య రేణుక. ఎందుకంటే ఆమెది ప్రేమ వివాహం. చెన్నకేశువులు ఆమెను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.

 

ఇప్పుడు రేణుక గర్భవతి కూడా. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురిలో ఒకరైన చెన్నకేశవులు భార్యకు భర్త మృతితో తీర్చలేని కష్టమొచ్చింది. ఆమె స్వగ్రామం కూడా చెన్నకేశవులు ఊరే. రేణుక చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఇప్పుడు అన్నీ సర్వస్వం అనుకున్న భర్త చెన్నకేశవులు.. ఇలా రేప్ కేసులో ఇరుక్కుని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆమెకు నా అన్నవాళ్లు లేరు.

 

అందులోనూ ఆమెది నిరుపేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. భర్త మరణంతో ఇప్పుడు ఆమె అత్తింటిపై ఆధారపడాల్సిన పరిస్థితి. కోడలిని పోషించే స్థోమత కూడా చెన్నకేశవులు తల్లిదండ్రులకు లేదు. చెన్నకేశవులు చేసిన పాపిష్టి పనితో ఇప్పుడు ఆమె జీవితం అస్తవ్యస్తమైంది. పెళ్లయి, తల్లి కాబోతున్న ఆమెకు దిశ సంఘటన అశనిపాతమే అయ్యింది. చేయని తప్పుకు జీవితాంతం శిక్ష అనుభవించాల్సిన పరస్థితి తలెత్తింది.

 

 

రేణుక బిడ్డ అమ్మ కడుపులో ఉండగానే నాన్నను పోగొట్టుకున్నాడు. అంతేనా.. చెన్నకేశవులు వంటి రేపిస్టును ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా సొంతూరిలోనూ చీత్కారాలే. అయినవాళ్లు ఆదుకోవడానికి ముందుకు రారు. అందుకే.. నా భర్తనెలా చంపారో.. నన్ను కూడా తీసుకెళ్లి అలాగే చంపేయండి సార్... నా భర్త లేకుండా బతకలేను అని చెన్న కేశవులు భార్య కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. భర్త చేసిన పాపం ఆమె జీవితాన్ని వెంటాడుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: