గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం జగన్. న్యాయం జరగాల్సిన సమయంలో జరగకపోతే.. ఆ తప్పు ప్రభుత్వానిదే అవుతుందని.. అలా జరగకూడదనే సచివాలయాల వ్యవస్థ రూపొందించినట్టు తెలిపారు ముఖ్యమంత్రి. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ఈ వ్యవస్థపై రివ్యూ చేస్తానని.. వాటిని ఓన్‌ చేసుకోవాలన్నారు సీఎం జగన్. 

 

ఏపీలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలపై.. అధికారులకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు వివిధ పథకాలు, వివిధ కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి. ఆశించిన స్థాయిలో ప్రజలకు ఫలితాలు అందాలంటే... గ్రామసచివాలయాలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఆ వ్యవస్థలు బాగా పనిచేసినప్పుడే ప్రభుత్వ కలలు నిజమవుతాయన్నారు ఏపీ సీఎం.

 

సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను అనుకున్నట్టుగా ఉపయోగిస్తున్నామా..? లేదా..? అన్నదానిపై అధికారులు సమీక్ష చేయాలని, గ్రామ సచివాలయం నుంచి సంబంధిత పోర్టల్‌లో రిక్వెస్ట్‌ రాగానే వెంటనే స్పందించాలని సూచించారు ముఖ్యమంత్రి. గ్రామ, వార్డు సచివాలయాల్లో అందిస్తున్న 541 సేవలను నిర్దేశిత కాలంలోగా అందిస్తామని హమీ ఇచ్చామని, ఏ సేవలు ఎప్పటిలోగా అందుతాయో గ్రామ సచివాలయాల్లో బోర్డులు కూడా పెడుతున్నామన్నారాయన. ప్రజలకు ఇచ్చిన హామీలను గౌరవించేలా ఉండాలని, గ్రామ సచివాలయాలనుంచి వచ్చే విజ్ఞాపనలు, దరఖాస్తులకు ప్రతి శాఖకార్యదర్శి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు ముఖ్యమంత్రి.

 

ప్రతి శాఖలోనూ, విభాగంలోనూ ఓ వ్యక్తి పర్యవేక్షణ ఉండాని, వచ్చే దరఖాస్తులు, విజ్ఞాపనలను పట్టించుకోలేదంటే.. ఆ శాఖలో సమస్య ఉన్నట్టే లెక్క అని తెలిపారు సీఎం జగన్. ప్రతి విభాగానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని విజ్ఞాపనలు గ్రామ సచివాలయం నుంచి వచ్చాయన్న సమాచారం నేరుగా సీఎం కార్యాలయానికి వచ్చేలా చర్యలు తీసుకున్నామని, ఎలా పని చేస్తారో ముఖ్యమంత్రి కార్యాలయమే చూస్తుందన్నారు ఏపీ సీఎం. అంతేకాక, శాఖల కార్యదర్శులు కూడా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు.

 

వ్యవస్థ పనితీరులో ఎక్కడైనా ఆలస్యం జరిగితే, సమాజంలో అట్టడుగున ఉన్న బీదవాళ్లు, సామాన్యులు నష్టపోతారని, న్యాయం జరగాల్సిన సమయంలో జరగకపోతే అది కూడా తప్పే అవుతుందని అధికారులకు సూచించారు సీఎం. ప్రభుత్వ విభాగాలు సరిగ్గా స్పందించకపోతే... పేదవాడికి నష్టం జరుగుతుందని, రాబోయే రోజుల్లో ప్రారంభించే పథకాలకు మార్గదర్శకాలు, అనుసరిస్తున్న విధానాలు, లబ్ధిదారుల ఎంపిక అంతా ఒక ప్రాసెస్‌ ప్రకారం జరగాలన్నారు. 

 

రేషన్‌కార్డులు, పెన్షన్లు తదితర లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరిగిందని గర్వంగా చెప్పగలుగుతున్నామంటే.. దానికి కారణం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలే కారణమన్నారు ఏపీ సీఎం. గ్రామ సచివాలయాల్లో ప్రతి రోజూ స్పందన కార్యక్రమం నిర్వహించాలని, వాలంటీర్లకూ అటెండెన్స్‌ విధానం తీసుకురావాలని సూచించారు ముఖ్యమంత్రి. ప్రతీ నెల ఒకసారి సమీక్ష కూడా ఉంటుందన్నారు. ఈ సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని సహా వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు హాజరయ్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: