ఏపీ సీఎం జగన్ 2019 డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి మూడు రాజధానులు ఉండవచ్చని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జగన్ నిర్ణయానికి అనుకూలంగా జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదికలు ఉండటంతో వైసీపీ మూడు రాజధానుల దిశగా అడుగులు వేసింది. మూడు రాజధానుల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపగా శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు బిల్లు ఆమోదం పొందకుండా చేశారు. 
 
ఆ తరువాత వైసీపీ శాసనమండలి రద్దు దిశగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఏపీ మూడు రాజధానుల నిర్ణయం గురించి జగన్ ప్రకటన చేసిన రోజు నుండి బీజేపీలో భిన్న స్వరాలు వినిపించాయి. తాజాగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అమరావతికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ జగన్ కు షాక్ ఇవ్వబోతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుజనా చౌదరి జగన్ ప్రభుత్వం రాజధాని తరలింపు వ్యవహారాన్ని పక్కన పెట్టి పరిపాలనపై దృష్టి పెడితే మంచిదని చెప్పారు. 
 
వైసీపీ నేతలు ఢిల్లీలో ఒక మాట, అమరావతిలో మరో మాట చెబుతూ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అవసరమైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను అమరావతికి తీసుకెళ్తామని వ్యాఖ్యలు చేశారు. జగన్ కోర్టులు చెప్పినా ఖాతరు చేయడం లేదని ఆరోపించారు. మూడు రాజధానుల విషయంలో బీజేపీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 
 
జగన్ 151 సీట్లు వచ్చినంత మాత్రాన ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పారు. జగన్ రాయలసీమకు ఏం చేస్తారో చెప్పడం లేదని అన్నారు. రాజధానిని అమరావతి నుండి కదిలించే అవకాశమే లేదని చెప్పారు. వేల కోట్ల రూపాయలు వృథా చేయమని కేంద్రం చెప్పబోదని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం ఏపీకి కరోనా వైరస్ లా తయారైందని ఢిల్లీలో మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ సుజనా వైసీపీపై విమర్శలు చేయడంతో అతి త్వరలో బీజేపీ జగన్ కు బిగ్ షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: