ఏపీలో విప‌క్ష టీడీపీకి రెండే రెండు రోజుల్లో మూడు దిమ్మ‌తిరిగే షాకులు త‌గిలాయి. అస‌లే వ‌రుస షాకుల‌తో బాబోరు విల‌విల్లాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే గురు, శుక్ర‌వారాల్లో రెండు పెద్ద షాకుల‌తో పార్టీ కుదులైంది. గురువారం ప్ర‌కాశం జిల్లాకు చెందిన పార్టీ సీనియ‌ర్ నేత‌, చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం పార్టీ మారిపోయారు. ఆయ‌న కండువా క‌ప్పుకోక‌పోయినా ఆయ‌న త‌న‌యుడు క‌ర‌ణం వెంక‌టేష్ కండువా క‌ప్పుకున్నారు. ఇక బ‌ల‌రాం టీడీపీలో చంద్ర‌బాబు కంటే సీనియ‌ర్ నేత‌.

 

ఇక శుక్ర‌వారం కీల‌క‌మైన క‌ర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు, టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. టీడీపీకి మ‌నుగ‌డ లేద‌న్న ఆయ‌న క‌నీసం తాను అడిగిన వారికి సైతం కార్పొరేట‌ర్ టిక్కెట్లు ఇవ్వ‌లేని ప‌రిస్థితి పార్టీలో ఉంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఓ బీజేపీ నేత మాట‌ల‌ను జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు వింటున్నాడ‌ని.. త‌న మాట‌లు మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అన్నారు. ఇక ఇప్పుడు ప్ర‌కాశం జిల్లా నుంచి మాజీ మంత్రి సిద్ధా రాఘ‌వ‌రావు సైతం పార్టీ మారేందుకు రెడీ అవుతున్నార‌ట‌. ఆయ‌న‌పై ఎప్ప‌టి నుంచో తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయి.

 

ఇక అనంత జిల్లాకు చెందిన‌ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామిని బాల టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది కాలంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల వారు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.  గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు జేసీ మాట‌లు విని యామిని బాల‌కు శింగ‌న‌మ‌ల సీటు ఇవ్వ‌లేదు. బండారు శ్రావ‌ణికి సీటు ఇవ్వ‌గా ఆమె ఓడిపోయారు. ఇక త‌మ‌ను ప‌ట్టించుకోవడం లేద‌న్న ఆవేద‌న‌తోనే వారు బాబోరికి షాక్ ఇవ్వాల‌నుకుంటున్నార‌ట‌. ఇక ఇదే లిస్టులో మ‌రి కొంత మంది కీల‌క నేత‌లు కూడా ఉన్న‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: