పొరుగు రాష్ట్రాల నుంచి మావోయిస్టు యాక్షన్ టీమ్‌లు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయా?మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు భారీగా కూంబింగ్ నిర్వహించటానికి కారణం ఏంటి? ప్రాణహిత-పెన్‌గంగ- గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు దేనికి సంకేతం? అసలు...తెలంగాణ-మహరాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఏం జరుగుతోంది?

 

మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, ప్రాణహిత పరివాహక ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు, కేంద్ర సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి. ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని నీల్వాయి, కోటపల్లి మండలం అర్జునగుట్టలో బందోబస్తు ఏర్పాట్లను రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ పర్యవేక్షించారు. గత కొద్ది రోజుల నుంచి మావోయిస్టులు నదిని దాటి తెలంగాణలోకి ప్రవేశంచే అవకాశం ఉందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసు ప్రత్యేక బలగాలు మంచిర్యాల జిల్లాపై డేగ కన్నుతో నిఘా వేశాయి. 

 

ఇక...తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో రాకపోకలు సాగించే వారిపై నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. వచ్చిపోయే వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో రోజుల తరబడి కూంబింగ్ కొనసాగుతోంది. అటు...భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలోని సరిహద్దుల్లో ప్రత్యేక పోలీసు టీములను రంగంలోకి దింపారు.

 

మరోవైపు...మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. నీల్వాయి, కోటపల్లి, చెన్నూరుతో పాటు ప్రాణహిత ఉపనదికి 16 ఫెర్రీ పాయింట్స్,  వెంచేపల్లి, అర్జునగుట్ట, కల్లంపల్లి, శీర్షాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. షాడో టీమ్స్, కౌంటర్ యాక్షన్ టీమ్స్, టాస్క్ ఫోర్స్ టీమ్స్‌ను రెడీగా ఉంచారు. మావోయిస్టు దళాలు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయని తెలిసిన పోలీసులు బోర్డర్స్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రాణహిత పరివాహక ప్రాంతం అంతా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, ఇంటర్నెట్‌తో వాటిని అనుసంధానించారు. అపరిచితుల కదలికలపై గట్టి నిఘా పెట్టారు పోలీసులు.

 

అటు...మంచిర్యాల జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన నీల్వాయిలో గ్రామ సభ నిర్వహించారు పోలీసులు. మావోయిస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. మావోయిస్టులు గ్రామాల్లోకి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాలని రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. సభ అనంతరం గ్రామంలోని పేద కుటుంబాలకు బియ్యం, దుప్పట్లు, దోమ తెరలు, యువకులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఓ వైపు నిఘా పెంచటంతో పాటు మరోవైపు ప్రజలను మావోయిస్టులకు సహకరించకుండా చేస్తున్నారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: